ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మనుషులకు మనుషులకు మధ్య వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండగా, మరోవంక వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితులు నెలకొనగా భారత్‌లో మాత్రం వైరస్ వ్యాప్తి తగ్గిందని చెబుతున్నారు. ‘ఆర్’ విలువను బట్టి ఈ విషయాన్ని అంచనా వేశారు.
అసలు ఈ ‘ఆర్’ అంటే ఏమిటి? ఒక కరోనా రోగి సగటున ఎంతమందికి ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాడనే విషయాన్ని తెలిపే కొలమానాన్నే ‘ఆర్’ విలువ అంటారు. ‘ఆర్‌నాట్’ అని కూడా అంటారు. దీని విలువ ఎంత ఎక్కువ వస్తే వ్యాధి అంత ఎక్కువ మందికి వ్యాపిస్తోందని అర్థం. ఈ ఆర్ విలువ భారత్‌లో తొలి సారిగా 1 కంటే తక్కువగా నమోదైనట్లు చెబుతున్నారు.
చెన్నైలోని ‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్స్’ లెక్కల ప్రకారం దేశవ్ప్తాంగా ఈ వారం ఆర్ విలువ 0.93గా నమోదైంది. గత వారం ఇదే విలువ 1.08గా ఉంది. ముఖ్యంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకలో కూడా ఈ విలువ 1 కంటే తక్కువగా నమోదైంది. ఈ ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగా పడి కరోనా వ్యాప్తిలో తగ్గుదల నమోదైంది.
భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇంత తక్కువ ఆర్ విలువ ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ ఆర్ విలువను ప్రతి వారం లెక్కిస్తారు. కరోనా తీవ్ర ప్రభావిత రాష్ట్రాలైన ఎపిలో గత వారం 0.95 ఉండగా అది 0.80కి తగ్గింది.
తెలంగాణలో 0.94 నుంచి 0.92కు, మహారాష్ట్రలో 1.17 నుంచి 0.86కు, కర్ణాటకలో 0.95 నుంచి 0.80కు, యుపిలో 1.10 నుంచి 0.91కి, ఒడిశాలో 1.11 నుంచి 1.04కు, పంజాబ్‌లో 1.16 నుంచి 1.07కు తగ్గింది. కాగా తమిళనాడులో 0.93 నుంచి 0.99కి, కేరళలో 1.07 నుంచి 1.20కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్ లాంటి జనసాంద్రత గల దేశాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడం చాలా కష్టం. అయితే కొంతకాలం పాటు ఆర్ విలువను 1 కంటే తక్కువగా ఉంచితే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More Stories
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర