లోకల్ లాక్ డౌన్ లతో మేలు జరిగిందా?  

దేశవ్యాప్తంగా 700కు పైగా జిల్లాలకు గాను 60 జిల్లాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ  వెల్లడించారు. ఏడు రాష్ట్రాల్లో కేసులు చాలా తీవ్రంగా పెరుగుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి పలు రాష్ట్రాలు ఒకటి, రెండు రోజుల పాటు లోకల్ లాక్ డౌన్లు విధించిన నేపథ్యంలో అలాంటి లోకల్ లాక్ డౌన్ ల వల్ల వైరస్ కు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారా? లేదా? అంచనా వేసుకోవాలని ప్రధాని సూచించారు. 

కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ  బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సీఎంలతో పాటు ఆరోగ్య మంత్రులు కూడా   పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ  మాట్లాడుతూ వైరస్ పై పోరాటం కొనసాగిస్తూనే ఆర్ధిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలని చెప్పారు.

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ప్రధానంగా ‘‘మైక్రో కంటైన్ మెంట్ జోన్స్’’పై ఫోకస్ పెట్టాలని పేర్కొన్నారు. దీనివల్ల అటు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు ఇటు ఎకనమిక్ యాక్టివిటీలు కొనసాగేందుకు వీలవుతుందని చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్, సర్వీలెన్స్ పై మరింతగా ఫోకస్ పెట్టాలని ప్రధాని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఎక్కువ మంది కరోనా రోగులకు లక్షణాలు కనిపించడం లేదని, పాజిటివ్ వచ్చినా సామాన్య ప్రజలు అంత ఈజీగా నమ్మలేరని ప్రధాని చెప్పారు.  కొంతమంది ఈ రోగం తీవ్రతనూ తక్కువగా అంచనా వేస్తారని, అందుకే వదంతులు వ్యాపించకుండా తగిన సమాచారంతో అవగాహనా కలిగించే విధంగా కృషి చేయాలని  సూచించారు.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మందులను రవాణా చేసేటప్పుడు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. దేశంలో నమోదైన అన్ని కరోనా కేసుల్లో 65.5 శాతం కేసులు ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మొత్తం కరోనా మరణాల్లో 77 శాతం మరణాలు, దేశంలోని అన్ని యాక్టివ్ కేసుల్లో 63 శాతం కేసులు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ ఏడు రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని, ప్రధానంగా మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీలో డెత్ రేటు కేస్ ఫెటాలిటీ రేట్ (సీఎఫ్ఆర్) కంటే 2 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. పంజాబ్, యూపీ తప్ప ఇతర ఐదు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు జాతీయ సగటు కంటే 8.52 శాతం ఎక్కువగా ఉందన్నారు.