కరోనాతో కేంద్రమంత్రి సురేశ్‌ అంగడి మృతి

కరోనాతో రైల్వే సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ సురేశ్‌ అంగడి (65) కన్నుమూశారు. దాదాపు రెండువారాల క్రితం వైరస్‌ సోకడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మరణించారు. కరోనాతో మృతిచెందిన తొలి కేంద్రమంత్రి సురేశ్‌ అంగడి కావడం గమనార్హం.
దేశంలో ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బెళగావి జిల్లా కేకే కొప్ప గ్రామంలో 1955 జూన్‌ 1న సురేశ్‌ అంగడి జన్మించారు. న్యాయశాస్త్రంలో ఆయన పట్టభద్రులు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. బెళగావి లోక్‌సభ నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు గెలిచారు.
కాగా సురేశ్‌ అంగడి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీగా, మంత్రిగా నిబద్ధత కలిగిన ఆయన సేవలను మర్చిపోలేమని కొనియాడారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలన్నీ ఆయన కుటుంబం, స్నేహితులతోనే ఉన్నాయని ప్రధాని ట్విట్ చేశారు. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి సురేశ్‌ కృషి ఎనలేనిదని గుర్తు చేసుకున్నారు.బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ప్రముఖులు సురేశ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
 
మరోవంక, టాలీవుడ్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా వైరస్ తో బుధవారం రాత్రి దుర్మరణం చెందాడు. సెప్టెంబర్ 2న కరోనా వైరస్ సోకడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు.
 
 కరోనా నెగిటివ్ వచ్చాక కూడా ఆయన కోలుకోలేదని పేర్కొన్నారు. ఆయన భార్య, కుమారుడు ఉన్నాడు. ఎఫ్ సిఐలో మేనేజర్ గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఛలో, పిల్లజమిందారు, మర్యాద రామన్న చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.