ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని బిజెపి ధర్నా 

మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలతో హోరెత్తించాయి. ఎల్ఆర్ఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు.
ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​ పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మనోదైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు ఎల్ఆర్‌ఎస్‌ను విధించిందని ఆరోపించారు.
వెంటనే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.