ఆపదలో కేంద్రం ఆదుకోవడం లేదని తరచూ నిందారోపణలు చేస్తూ కాలం గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులను సహితం ఖర్చు చేయలేక పోవడం గమనిస్తే ఆయన పాలన పడక వేసిన్నట్లు స్పష్టం అవుతుంది. తెలంగాణలో కరోనా నివారణ కోసం కేంద్రం రూ.256 కోట్లను ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.164 .41 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
సమాచార హక్కు చట్టం కింద జలగం సుధీర్ అనే వ్యక్తి అడిగిన వివరాలను సర్కారు వెల్లడించింది. జూన్ నాటికే కేంద్రం రూ.215 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఖర్చు చేసిన రూ.164 కోట్లలో రూ.67.23 కోట్లు మందులకు, రూ.30.68 కోట్ల సర్జికల్ పరికరాలకు, సివిల్ వర్క్స్ కోసం రూ.23.49 కోట్లు, పరికరాల కోసం రూ.42.99 కోట్లు ఉపయోగించినట్లు తెలిపింది.
ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇచ్చిన నిధులను ఇప్పటికీ పూర్తి ఖర్చు చేయకున్నాతెలంగాణకు మరో రూ.75 కోట్లు ఇవ్వనున్నట్టు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం గమనార్హం.
రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రజలు, కార్పొరేట్ కంపెనీల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. ఒక్క టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకే రూ.18.26 కోట్ల విరాళాలు వచ్చినట్టు అధికారులు చెప్పారు. భారీగా వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించింది.
తెలంగాణకు కేంద్రం 1,400 వెంటిలేటర్లను ఇవ్వగా ఇంకా వీటిని వాడుకలోకి తీసుకు రావడం కూడా ఆరోగ్య శాఖ పూర్తి చేయలేదు. తెలంగాణకు 3,23,207 ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్లను కేంద్రం పంపింది. నమూనాల నుంచి ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్ చేయడానికి రూ.84.37 లక్షల విలువైన యంత్రాలు అందజేసింది. 13.85 లక్షల మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42.5 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.
కరోనా బారిన పడిన చాలా మందిలో లంగ్స్ పాడవుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. దీంతో లంగ్స్ ఏ మేరకు పాడైపోయాయో తెలుసుకోవడానికి సీటీ స్కాన్ చేయించాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.
కానీ మన ప్రభుత్వ దవాఖాన్లలో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ యంత్రాలు సరిగా పనిచేయట్లేదు. చుట్టుపక్కల ఏడెనిమిది జిల్లాలకు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ పెద్దదిక్కుగా ఉంది. ఇక్కడ రెండేళ్లుగా సీటీ స్కానర్ పని చేయట్లేదు. ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లా హాస్పిటళ్లలోనూ సీటీ స్కాన్ యంత్రాలు మూలకే ఉంటున్నాయి.
కేంద్రం నిధులున్నా యంత్రాలను రిపేర్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక అక్కడి ఏరియా హాస్పిటళ్లను జిల్లా హాస్పిటల్స్‌గా పేరు మార్చారు. కానీ జిల్లా హాస్పిటల్స్ లో ఉండాల్సిన సౌకర్యాలు వీటిని అక్కడ సమకూర్చలేదు.
ఇప్పటికీ చాలా జిల్లాల్లో సీటీ స్కాన్ మిషన్లు లేవు. ప్రభుత్వ దవాఖాన్లను బలోపేతం చేయాలని కేంద్రానికి సూచించిన కేసీఆర్ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లపై కూడా దృష్టి పెట్టాలని డాక్టర్లు కోరుతున్నారు.
More Stories
ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్
ఫలితాలతో బిజెపి ఫుల్ జోష్.. ఇక మహారాష్ట్ర, ఝార్ఖండ్ లపై దృష్టి
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ జఠిలమైన సమస్య