కరోనా రికవరీల్లో అమెరికాను దాటేసిన భారత్ 

కరోనా రోగుల రికవరీలో ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో దాదాపు 95,885 మంది రికవర్​ అయినట్టు తెలిపింది. అయితే దేశంలో కేసుల సంఖ్య 54 లక్షలు దాటిందని తెలిపింది. కరోనా రికవరీ కేసుల విషయంలో భారత్ అమెరికాను దాటేసిందని వెల్లడిస్తూ ఓ ట్వీట్​ చేసింది. 

ఇప్పటి వరకూ 42 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని, అదే అమెరికాలో 41 లక్షల మంది రికవర్​ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 79.28 శాతంగా ఉందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు, ఎక్కువ సంఖ్యలో టెస్టులను చేయడం, హైక్వాలిటీ ట్రీట్​మెంట్, సర్వయిలెన్స్​ వల్లే రికవరీల సంఖ్య పెరిగిందని వెల్లడించింది.

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానం లో ఉంది. ప్రపంచంలోని మొత్తం కేసుల్లో 17 శాతం మన దేశంలోనే నమోదవుతున్నాయి. సెప్టెంబర్​ నెల మొదలైనప్పటి నుంచి దేశంలో రోజుకు సగటున 90 వేలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. 

ఒక్క సెప్టెంబర్​లోనే 16,86,769 కొత్త కేసులు రికార్డయ్యాయి. అయితే జనాభాతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే మన దగ్గర తక్కువని కేంద్రం చెబుతోంది. మరోవైపు దేశంలో మరణాల రేటు కూడా 1.61 శాతమేనని శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో స్పష్టం చేసింది.

దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం కొన‌సాగుతున్నా ఐదురోజుల క్రితం ల‌క్ష‌కు చేరువ‌గా న‌మోదైన క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 93 వేలు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి వెయ్యి త‌క్కువ‌గా రికార్డ‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన‌ 24 గంట‌ల్లో కొత్త‌గా 92,605 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.
దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 54,00,620 చేరింది. ఇందులో 10,10,824 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన 43,03,044 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల కొత్త‌గా 1,133 మంది చ‌నిపోయారు. దీంతో క‌రోనా మృతులు 86,752కు చేరాయని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది.  
 
నిన్న ఒక్క‌రోజే 12,06,806 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. దీంతో సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు 6,36,61,060 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.