పాక్ స్మగ్గ్లింగ్ కుట్ర భగ్నం చేసిన బీఎస్‌ఎఫ్!

జమ్ములోకి మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేందుకు పాక్ పన్నిన కుట్రలను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భగ్నం చేసింది. శనివారం రాత్రి రాజ్‌పురా సెక్టర్‌లోని సరిహద్దు వెంబడి కొందరు పాకస్థానీ జాతీయులు డ్రగ్స్, తుపాకులను భారత్‌లో తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది హెచ్చరికగా కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. 
 
‘ఆ నలుగురు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం భారత్‌వైపు నుంచి ఎదురు చూస్తున్నవారు కూడా పారిపోయి ఉండొచ్చు’ అని బీఎస్‌ఎఫ్ ఐజీ ఎన్ఎస్ జమ్వాల్ తెలిపారు. 
 
బుద్వార్ పోస్టు సమీపంలో ఓ పైపు ద్వారా దుండగులు 62 ప్యాకెట్ల మాదక ద్రవ్యాలు, రెండు పిస్టళ్లు, నాలుగు మ్యాగజీన్లు భారత్‌లోకి పంపించే ప్రయత్నం చేశారని అధికారులు తెలిపారు. ప్యాకెట్లను ఇంకా పరీక్షించలేదని, అయితే పాక్ తరచూ హెరాయిన్‌ను స్మగుల్ చేసే ప్రయత్నం చేస్తుంటుందని వారు చెప్పారు. 
 
అంతకుమనుపు శుక్రవారం నాడు భారత సైనికులు ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ల సాయంతో పాకిస్థాన్ భారత భూభాగంలో జారవిచిడిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నగదును వారు తీసుకుంటుండగా పోలీసులు ఉగ్రవాదులను అదుపు లోకి తీసుకున్నారు. డ్రగ్స్, నకిలీ నగదు ద్వారా భారత్‌‌న నష్టపరచాలన్నది పాక్ వ్యూహమని అధికారులు చెబుతున్నారు.