చైనా సరిహద్దులో ఆరు ఎత్తైన ప్రాంతాలు భారత్ స్వాధీనం

చైనా సరిహద్దులో ఆరు ఎత్తైన కీలక ప్రాంతాలను భారత ఆర్మీ స్వాధీనం చేసుకున్నది. తూర్పు లఢక్ సెక్టార్‌లో ఒక వైపు చైనాతో ఘర్షణ వాతావరణం కొనసాగుతండగా భారత ఆర్మీ క్రమంగా వ్యూహాత్మక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు కొత్తగా ఆరు ఎత్తైన ప్రాంతాలను భారత ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
మగర్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజాంగ్ లా, మోఖ్పారి, ఫింగర్ 4 సమీపంలోని ఎత్తైన వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను భారత సైనికులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రాంతాలపై చైనా కన్నేయడంతో ఆ దేశ సైనికులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు భారత ఆర్మీ వీటిని స్వాధీనం చేసుకున్నదని వివరించాయి. ఇవన్నీ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కు ఇవతల ఉన్న భారత భూభాగంలోనివేనని స్పష్టం చేశారు.
ఎల్‌ఏసీ సమీపంలోని పాంగాంగ్ సరస్సు ఉత్తరం నుంచి దక్షిణం వరకు వ్యూహాత్మంగా ఉన్న ఈ ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ఇటీవల ప్రయత్నించగా భారత్ తిప్పికొట్టింది. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య గాల్లోకి కాల్పులు జరిగాయి. మరోవైపు కొత్తగా ఆరు ఎత్తైన ప్రాంతాలను భారత్ స్వాధీనం చేసుకోవడంతో రెచెన్ లా, రెజాంగ్ లా ప్రాంతాల వద్ద చైనా 3 వేల అదనపు బలగాలను మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
జూలై 15న గాల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటనతో చైనా సరిహద్దులో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది.
గల్వాన్ లాంటి పరిస్థితులు ఎదురైతే ఆయుధాలు వాడకుడదన్న నిబంధనను పక్కకు పెట్టి ధీటుగా జవాబివ్వాలని ఆర్మీకి చెప్పింది. ఈ నేపథ్యంలో చైనా సైన్యం ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా భారత సైనికులు కాల్పులకు కూడా వెనకాడటం లేదు. దీంతో చైనా సరిహద్దులో ఇరు దేశాల మధ్య నెల రోజుల లోపు మూడుసార్లు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.