యుద్ధ నౌకల్లో ‘మహిళా’యుగం

 భారత యద్ధనౌకలలో ఇద్దరు మహిళా నేవీ అధికారిణిలను నియమించారు. సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, సబ్ లెఫ్టినెంట్ రితి సింగ్ దీని కోసం ఎంపికయ్యారు. కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ‘వింగ్స్’ ప్రధానం చేశారు. యుద్ధ నౌకలలోని హెలీకాప్టర్ల విభాగంలో వైమానిక వ్యూహకర్తలుగా వారు వ్యవహరిస్తారు.

యుద్ధ నౌకల్లో మహిళా నేవీ అధికారిణిలను నియమించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు నౌకా కేంద్రాల్లోని హెలీకాప్టర్లను మహిళా అధికారిణులు నడిపేవారు. భారత నౌకా దళంలో పలు ర్యాంకుల్లో ఎంతోమంది మహిళా అధికారులున్నా… యుద్ధనౌకల్లో వీరి నియామకం ఇది  మొదటిసారి.  ఎక్కువ సమయం విధులు నిర్వర్తించాల్సి రావడం, వీరికిచ్చే నివాస గృహల్లో పలు ఇబ్బందులు, శౌచాలయాల కొరత….. ఇలాంటి పలు కారణాలతో ఇప్పటి వరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడాలోని ఇండియన్ నేవీ అబ్జర్వర్ కోర్సులో ఉత్తీర్ణులైన 17 మందిలో వీరిద్దరితోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన నలుగురు మహిళా అధికారిణిలు, ముగ్గురు అధికారులు ఉన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్, చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (శిక్షణ) గ్రాడ్యుయేటింగ్ అధికారులకు అవార్డులు, సంబంధిత పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్ అధికారులను అభినందించారు. మహిళలకు హెలికాప్టర్ ఆపరేషన్లలో తొలిసారి శిక్షణ ఇవ్వడం ఒక మైలురాయి వంటిదని అన్నారు. భారత నావికాదళం‌లో ముందుండే యుద్ధనౌకలలో మహిళలను మోహరించడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

నేవీ బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, ఇంటెలిజెన్స్, నిఘా పరిశీలన, సెన్సార్ ఆపరేటింగ్‌తో పాటు వివిధ అంశాల్లో వీరు శిక్షణ తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిద్దర్నీ అత్యాధునికమైన ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లలో వీరు విధులు నిర్వర్తించనున్నారు.