అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా ఉద్యమం తీవ్రతరం

అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా ఉద్యమం తీవ్రతరం

అంతర్వేది ఘటనలో చర్చిపై హిందూ యువకులు దాడి చేశారని కేసులు పెట్టారని,  దోషులను గుర్తించకుండానే  అక్రమంగా అరెస్టులు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి  నిరసనగా ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. 

అయితే ప్రభుత్వం ఎక్కడికి అక్కడ తమ పార్టీ శ్రేణులను అక్రమ గృహనిర్బంధంలో పెట్టి పోలీసులతో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జిల్లాల వారీగా అనేక మంది నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారని విమర్శించారు. 

ముఖ్యమైన నాయకులను, పార్టీ పెద్దలను పోలీస్ స్టేషన్‌లలో పెట్టడం, రోడ్డు మార్గాల ద్వారా పోలీసు వాహనాల్లో తిప్పి సాయంత్రం 6 గంటల సమయంలో అందరినీ విడిచి పెట్టిన ప్రభుత్వ చర్యలను  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 

అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల మీద జరుగుతున్న  దాడులకు వ్యతిరేకంగా పోరాడతామని తేల్చిచెప్పారు. 

బీజేపీ రాష్ట్ర పదాధికారులు,  జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను సోమువీర్రాజు అభినందనలు తెలిపారు.