ఏపీలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వసం 

ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. అనంతపూర్ జిల్లాలోని కొల్లూరు ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం అమావాస్య కావడంతో దేవాలయ ప్రాంగణంలోని ధ్వజస్థంభం వద్ద పూజల చేశారు. ఆంజనేయస్వామి విగ్రహం తలభాగాన్ని దుండగులు వేరు చేశారు. 

కల్యాణదుర్గం మండలం బొట్టువానపల్లిలో ఈ ఘటన జరిగింది. దేవాలయం పైభాగంలోని రామ, లక్ష్మణ, సీత విగ్రహాల పక్కన ఆంజనేయ విగ్రహం ఉండగా దాన్ని ఎత్తుకు వచ్చి ధ్వంసం చేశారు. ఈ ఘటనను స్థానికులు శుక్రవారం గమనించారు. ఆంజనేయస్వామి విగ్రహ ధ్వంసంపై గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు.

మరోవంక కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం తాళాలను పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు నందీశ్వరుని విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను అర్చకుడు అత్తలూరి యుగంధర్‌ శర్మ గురువారం ఉదయం గుర్తించారు. వెంటనే ఈవో  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇలా ఉండగా, విజయవాడ కనకదుర్గా ఆలయంలో  మూడు సింహాలు వెండివి కాకపోవచ్చని స్వయంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు అనుమానం వ్యక్తం చేయడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

 ‘‘దుర్గమ్మ ఉత్సవ రథంపై మాయమైన సింహాలు అసలు నిజంగా వెండివా, కాదా.. అన్నది తేలాల్సి ఉంది. రథం నల్లగా ఉంది. నాకు వెండి రథం అని అప్పగించారు. సుమారు 250 కేజీల బరువున్న రథాన్ని18ఏళ్ల క్రితం తయారు చేశారు. ఇప్పుడు ఊడిన విగ్రహాన్నే చూశారుగా… ఎంత నల్లగా ఉందో! అది వెండో కాదో పరీక్షించాల్సి ఉంది. ఊడదీసి తూకం వేసి పరిశీలించాల్సి ఉంది’’ అని తెలిపారు. 

కాగా, మంత్రి వెలంపల్లి శృనివాసరావు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తే వెండి సింహాలు తప్పకుండా దొరుకుతాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్‌ ఆరోపించారు. తాంత్రిక పూజల కోణంలోనూ పోలీసులు విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. వెండి సింహాలు చోరీకి గురైనట్లు మంత్రికి, ఈవోకి, దుర్గగుడి చైర్మన్‌కు అందరికీ తెలుసని చెప్పారు.