చలో అమలాపురం జరిగి తీరుతుంది  

చలో అమలాపురం జరిగి తీరుతుంది  
శుక్రవారం చలో అమలాపురం జరిగి తీరుతుందని బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్‌ చేశారు? అని వీర్రాజు ప్రశ్నించారు. చర్చిలపై రాళ్లు వేసిన వారిపై ఫైర్‌ అయిన ప్రభుత్వం  రథం తగులబడితే ఎందుకు ఫైర్‌ కాలేదని నిలదీశారు.
హిందూ ఆలయాలపై దాడులు చేస్తే పిచ్చొళ్లు అంటున్నారని, ఈ ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమా? అని ప్రశ్నించారు. దాడులను ప్రశ్నిస్తే తమ వాళ్లను అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికే కాదు తమకు కూడా కొన్ని వ్యూహాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ముందుగా బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తాజాగా.. ప్రకాశం జిల్లా కారంచేడులో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీమంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబును హనుమాన్ జంక్షన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. 
ప్రధాని మోదీని తిట్టినా, నల్ల జెండాలు‌ చూపినా సైలెంట్‌గా ఉన్నామని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. అంతర్వేదిలో చర్చి కట్టడానికి ఓ ఎమ్మెల్యే యత్నించారని సోము వీర్రాజు ఆరోపించారు.
 
చలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే అమలాపురం పార్లమెంట్ పరిధిలో 30, 144 సెక్షన్‌లను విధించారు. సోమువీర్రాజు ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజును కూడా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 
 
కాగా, అంతర్వేది ఘటనలో 37 మందిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఈ చర్యని నిరసిస్తూ శుక్రవారం అమలాపురంలో నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమలాపురం వెళ్తున్న బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 
 
అంతర్వేది ఘటనలో పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ, పాశవిక పాలన నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారి మీద, అమాయకులపై ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. 
 
అధికార పార్టీ నేతలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. న్యాయం కోసం ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఇదెక్కడ న్యాయం? అని ప్రభుత్వాన్ని విష్ణుకుమార్ నిలదీశారు.