కేంద్ర మంత్రి ‌ సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా

కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమలశాఖ మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ గత రాత్రి తన పదవికి రాజీనామా చేశారు.   కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని శిరోమణి అకాలీదళ్‌ నిర్ణయించడంతో ఆమె రాజీనామా చేశారు. 
 
హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాద్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గత రాత్రి ఆమోదించారు. ఆమె మంత్రిత్వశాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు అప్పగించారు
 
రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అకాలీదళ్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. వ్యవసాయ బిల్లులపై ఎన్డీయేకు తన వైఖరి స్పష్టం చేసిన అకాలీదళ్‌ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతిస్తామని పేర్కొంది.
హర్‌సిమ్రత్‌ కౌర్‌ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని రాజీనామా సమర్పించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తామని లోక్‌సభలోనే అకాలీదళ్‌ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. దానితో లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేశారు.

గతంలో  అకాలీదళ్ అధ్యక్షుడిగా, పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ భార్యే హర్‌సిమ్రత్ కౌర్. 2009లో ఆమె రాజకీయాల్లోకి రాగా అప్పటి నుంచి 3సార్లు భటిండా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. మోదీ ప్రభుత్వంలో  రెండోసారి కేబినెట్ మంత్రి పదవి చేపట్టారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు.  
కాగా ఈ బిల్లులను వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా చేపట్టామని బీజేపీ పేర్కొంటోంది. ఈ బిల్లులపై పంజాబ్‌, హరియాణా రైతాంగం గత కొద్దివారాలుగా ఆందోళనలు చేపడుతోంది.