కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్ కు క‌రోనా  

పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతున్న వేళ క‌రోనా బారిన ప‌డుతున్న‌ కేంద్ర మంత్రుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. నిన్న కేంద్ర ర‌వాణా శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి క‌రోనా సోక‌గా, తాజాగా కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్‌కు క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. ఈమేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

తాను నిన్న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, ఫ‌లితాల్లో పాజిటివ్‌గా వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్య‌కాలంలో త‌నను క‌లిసిన‌వారు త‌గిన‌ జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని, క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. 

భారత్‌ దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు  పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 97,894 కేసులు నమోదు కాగా.. 1,132 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 51,18,254 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 83,198 మంది మృత్యువాతపడ్డారు.

దేశంలో ప్రస్తుతం 10,09,976 యాక్టివ్ కేసులుండాగా.. చికిత్స నుంచి కోలుకుని 40,25,080 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 82,719 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 78.64 శాతంగా కాగా మరణాల రేటు 1.63 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.