సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్బీ నగర్ నియోజకవర్గ యువమోర్చా నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సరూర్ నగర్ చెరువు కట్టపై జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్, ఇతర సీనియర్ నేతలు, ఎల్బీ నగర్ యువ మోర్చా నాయకులు తదితరులు హాజరయ్యారు. 
 
త్యాగాల పురిటిగడ్డగా పేరొందిన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కారణంగా విమోచన దినోత్సవం జరగడం లేదని శేఖర్జీ విమర్శించారు. కర్ణాటకలో, మహారాష్ట్రలలో సెప్టెంబర్ 17ని ఘనంగా నిర్వహిస్తున్నారని.. కానీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ అజ్ఞానాన్ని తొలగించేందుకే ఈ వెలుగుల కాగడాల ప్రదర్శన నిర్వహించామని ఆయన తెలిపారు. నిజాం రాజును ధిక్కరించి, రజాకార్లను ఎదిరించి నిలిచిన తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి నోచుకోకపోవడం నిజంగా బాధాకరమని బీజేపీ యువమోర్చా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.