ఆర్టీసీ ఎండీల మధ్య చర్చలు విఫలం

అన్ లాక్ ప్రకటించి నెలలు గడుస్తున్నా అంతరాష్ట్ర బస్ లను  తెలుగు రాష్ట్రాలు ఇంకా ఒక నిర్ణయానైకి రాలేకపోయాయి. అధికారులు కలుసుకొంటున్నా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తాజాగా మంగళవారం రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల భేటీలోనూ బస్సు సర్వీసులపై చర్చలు కొలిక్కిరాలేదు.

దీంతో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, ఈడీలు సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్‌ అంశాలపై చర్చలు జరిపారు. ఏయే రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై చర్చించారు.  తర్వాత రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2.65లక్షల కిలోమీటర్లకు బస్సులు తిరుగుతున్నాయని ఏపీ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు చెప్పారు. తెలంగాణలో ఏపీ బస్సుల 71 రూట్లలో, ఏపీలో తెలంగాణ బస్సులు 28 రూట్లలో నడుస్తున్నాయని తెలిపారు. 

రెండు రాష్ట్రాల మధ్య 1.1లక్షల కి.మీ వ్యత్యాసం ఉందని చెప్పారు. తాము 50వేల కి.మీ తగ్గిస్తామని, తెలంగాణ పెంచుకోవాలని ప్రతిపాదించినట్లు కృష్ణబాబు తెలిపారు. 1.10లక్షల కి.మీ నుంచి 1.60లక్షల కి.మీ వరకు పెంచేందుకు తెలంగాణ ముందుకొచ్చిందని, అంతకుమించి పెంచే సామర్థ్యం తమకు లేదని  చెబుతోందని పేర్కొన్నాన్నారు. 

అలా చేస్తే లాభదాయకంగా ఉండదని సమావేశంలో టీఎస్‌ ఆర్టీసీ అధికారులు చెప్పినట్లు ఆయన వివరించారు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీకి అనుమతి ఉందని చెబుతూ ఇతర రాష్ట్రాల రూట్‌ వైజ్‌ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ కోరిందని చెప్పారు. 

అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  రెండు రాష్ట్రాల బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ప్రైవేటు బస్సులకు లాభం చేకూరుతుందని కృష్ణబాబు విచారం వ్యక్తం చేశారు. 

రూట్ల వారీగా బస్సులు నడిపే మార్గాల ప్రతిపాదనలను తెలంగాణ అడిగిందని  అంటూ దానిపై  రెండు రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చర్చలు కొలిక్కి వచ్చేలోపు హైదరాబాద్, విజయవాడల మధ్య డిమాండ్ దృష్ట్యా చెరొక 250 బస్సులు నడుపుదామని ప్రతిపాదించామని కృష్ణబాబు తెలిపారు.

ఆ తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ మాట్లాడుతూ రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా బస్సులు నడపాలని తాము ప్రతిపాదించామని చెప్పారు. రూట్ వైజ్ నడిపితేనే రెండు రాష్ట్రాల ఆర్టీసీలకు లాభమదాయకం అని తెలిపారు. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడపడంతో నష్టం వస్తోందని పేర్కొన్నారు. 

రూట్ల వారీగా స్పష్టత ఇస్తే దానికి అనుగుణంగా తాము ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్, విజయవాడల మధ్య చెరి 250 బస్సులను నడిపే అంశంపై ఏకాభిప్రాయం రాలేదని చెప్పారు.