అమరావతి భూములపై ఏసీబీకి హైకోర్టు బ్రేక్ 

అమరావతి భూములపై ఏసీబీకి హైకోర్టు బ్రేక్ 

అమరావతి భూ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను మొదటి నిందితునిగా, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి కుమార్తెలిద్దరితో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో దర్యాప్తు, విచారణను ఏపీ హైకోర్టు నిలిపేసింది. 

అంతేకాక ఈ కేసులో ఏ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను బహిరంగంగా ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని పత్రికలను, టీవీలను, సోషల్‌ మీడియాను ఆదేశించింది.

ఈ విషయాన్ని ఆయా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలకు తెలియచేయాలని డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను హైకోర్టు ఆదేశించింది.  ఈ మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, సీఐడీ అదనపు డీజీ, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిలను ఆదేశించింది. పలు ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసుల జారీకి హైకోర్టు నిరాకరించింది.

ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించానన్న అక్కసుతో తనపై కక్ష సాధింపునకు దిగారని, తనను అరెస్టు చేయించేందుకు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారని దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

‘‘రాజకీయ ప్రత్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు, కేసులు పెట్టుకుంటారు. అంతకు మించి ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేయడం మనం చూశాం. కానీ… ప్రపంచంలోనే తొలిసారిగా ఒక న్యాయవాదిని ఈ వివాదంలోకి లాగేందుకు పూనుకున్నారు. అంటే, వృత్తి ధర్మంలో భాగంగా వారికి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తే.. వారిని కూడా కేసుల్లో ఇరికించేస్తారా?’’ అని దమ్మాలపాటి  తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, శ్యాం దివాన్‌లు   ప్రశ్నించారు. దుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాలు మాయం?