దుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాలు మాయం?

అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతూ ఉండగానే, విజయవాడలో ప్రసిద్ధి చెందిన దుర్గగుడి ఆలయ ప్రాంగణంలోని వెండి రథంపై ఉన్న నాలుగు సింహాల్లో మూడు మాయం కావడం విస్మయం కలిగిస్తున్నది. 
 
అంతర్వేది ఘటన అనంతరం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో రథాలకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దుర్గగుడిలోని రథాల భద్రత గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సోమవారం దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబుతో చర్చించారు. 
 
రథాలకు షెడ్లను నిర్మించడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం భద్రతా సిబ్బంది కాపలా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. అనంతరం అధికారులు వెండి రథాన్ని పరిశీలించేందుకు దానికి కప్పి ఉంచిన ప్లాస్టిక్‌ కవరు తీసి పరిశీలించారు. రథంపై నాలుగు వైపులా ఉండాల్సిన వెండి సింహాల్లో మూడు మాయమైనట్లు ఈ సమయంలోనే గుర్తించారు. 
 
కనకదుర్గమ్మకు ఉన్న మూడు రథాల్లో వెండి రథం ఒకటి. ప్రతియేటా ఉగాది రోజున శ్రీదుర్గామల్లేశ్వరులను ఈ రథంపైనే ఊరేగిస్తారు. ఈ ఏడాది ఉగాదికి కొవిడ్‌ నిబంధనల కారణంగా ఊరేగింపు నిర్వహించలేదు. గత ఏడాది ఉగాది పర్వదినాన ఆది దంపతులను అంగరంగ వైభవంగా ఈ వెండి రథంపై ఊరేగించారు. తర్వాత దీనిని మహామండపం ముందు నిలిపి, టార్పాలిన్‌ కప్పి ఉంచారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోలేదు.  
 
 వెండి సింహాలు మాయమైనట్టు గుర్తించిన వెంటనే స్పందించాల్సిన అధికారులు గోప్యంగా ఉంచడం విస్మయం కలిగిస్తున్నది.  24 గంటల తర్వాత ఈ విషయం తెలిసి మీడియా ఈవోను ప్రశ్నిస్తే మూడు రోజుల తర్వాత రికార్డులను పరిశీలించి నిర్ధారిస్తామని చెప్పడం గమనార్హం. చోరీ విషయం తెలియగానే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆలయ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.