పిఎస్‌బిలకు రూ.20 వేల కోట్లు

ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20 వేల కోట్ల మూలధన నిధిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ అనుమతి కోరింది. కరోనా సంక్షోభం కారణంగా పిఎస్‌బిలు (ప్రభుత్వరంగ బ్యాంకులు) రుణగ్రస్తుల నుండి డబ్బును తిరిగి పొందడం లేదని, దీంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ఎన్‌పిఎ పెరుగుతోందని లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. 
 
రీకాపిటలైజేషన్ బాండ్ల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పిఎస్‌బి) రూ.20 వేల కోట్లు ఇవ్వడానికి ఆర్థికమంత్రి పార్లమెంటు అనుమతి కోరారు. ఈ చర్యతో ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీ ఊరట లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కరోనా సంక్షోభం కారణంగా ఒత్తిడికి గురవుతున్న పిఎస్‌బిలకు మూలధనాన్ని అందించడం వల్ల సంక్షోభం నుండి బయటపడగలవు.
 
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.36 లక్షల కోట్లను అదనంగా ఖర్చు చేసేందుకు అనుమతివ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  పార్లమెంట్‌‌ను కోరారు.  అదనంగా రూ.1.67 లక్షల కోట్లు అవసరమవుతుందని,  మిగతా రూ.69 వేల కోట్లను వివిధ డిపార్టమెంట్ల సేవింగ్స్ నుంచి  ప్రభుత్వం సమకూర్చుకుంటుందని సీతారామన్‌‌ వివరించారు. 

అంతేకాదు దేశ ఆర్థిక లోటు పెరగబోదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే జూలైలో ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, పిఎస్‌బిలు, ప్రైవేట్ బ్యాంకుల (పివిబి) లకు రీకాపిటలైజేషన్ ప్రణాళికను ప్రభుత్వం తీసుకురావాలని, తద్వారా బ్యాంకుల్లో పెరుగుతున్న ఎన్‌పిఎల ఒత్తిడిని తగ్గగలదని తెలిపారు. 

కరోనా వైరస్ కారణంగా 2021 మార్చి నాటికి బ్యాంకుల ఎన్‌పిఎ 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శక్తికాంత దాస్ చెప్పారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) కింద రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ అనుమతి కోరారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.