ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కసరత్తు

ఇటీవల కాలంలో 50 శాతం వరకు పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించడానికి ఎంపిక చేసిన కొన్ని నగరాలకు 500 మెట్రిక్ టన్నుల ఉల్లిని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పండుగల సీజన్‌గా పరిగణించే అక్టోబర్-నవంబర్ మాసాలలో తమ వద్ద నిల్వ ఉంచిన ఉల్లిని కొన్ని రాష్ట్రాలకు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఉల్లిని విడుదల చేయడానికి ఎంపిక చేసిన నగరాలలో ఈశాన్య ప్రాంతం, జమ్మే కశ్మీరుతోపాటు హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ, కోల్‌కత, అహ్మదాబాద్, పుణె, ఇండోర్ ఉన్నట్లు వారు చెప్పారు. ఉల్లి ధరల నియంత్రణ చర్యలలో భాగంగా డైరెక్టర్ జనరల్ అఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్ టి) ఉల్లిని నిషిద్ధ విస్తువుల జాబితాలో చేరుస్తూ ఉల్లి ఎగుమతులను నిషేధించింది.

ఉల్లి ధరలు ఇటీవల కాలంలో బాగా పెరిగిన నగరాలకు తమ వద్ద ఉన్న నిల్వలలో నుంచి 500 మెట్రిక్ టన్నుల ఉల్లిని సరఫరా చేయాలని కేంద్రం యోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు అంతర్ మంత్రివర్గ సంఘం ప్రతిపాదించినట్లు వారు తెలిపారు. కాగా ఉల్లి ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా ఒకే రకంగా లేదని వారు చెప్పారు. ఢిల్లీలో ఈ వారం ఉల్లి ధరలు 33 శాతం పెరిగి కిలో ఉల్లి రూ.40కు చేరకుఉంది.

ఉల్లి ఎగుమతులలో పెరుగుదల కూడా వాటి ధరల పెరుగుదలకు కారణమని అధికారులు చెప్పారు. ఆగస్టులో ఉల్లి ఎగుమతులు విశేషంగా పెరిగాయని, గత ఏడాది ఆగస్టులో 1.26 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి ఎగుమతులు జరుగగా ఈ ఏడాది ఆగస్టులో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు జరిగాయని వారు వివరించారు. 

వచ్చే అక్టోబర్, నవంబర్ నెలలలో ఉల్లి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. ఉల్లి ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని వారు తెలిపారు.