2 శాతం  తగ్గిన గృహ ధరలు  

2 శాతం  తగ్గిన గృహ ధరలు  

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గృహ ధరల పెరుగుదల విషయంలో భారత్ ర్యాంక్ 11 స్థానాలు పడిపోయి 54కు చేరింది. గతేడాదితో పోలిస్తే ధరలు 2 శాతం తగ్గాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ సర్వే తెలిపింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ధరల్లో తగ్గుదల కారణంగా 56 దేశాల్లో భారత్ 54వ ర్యాంక్‌కు పడిపోయింది.

డిమాండ్ తగ్గడం, ప్రజల కొనుగోలు సామర్థ్యం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నివాస ఆస్తుల ధరలు 1.9 శాతం తగ్గాయి. మూడు నెలల్లో భారత్ 11 స్థానాలు పడిపోయింది. నైట్ ఫ్రాంక్ 56 దేశాలలో నివాస ఆస్తి ధరలలో వచ్చిన మార్పుల ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. 

2020 మొదటి త్రైమాసికంలో ఈ సూచీలో భారత్ 43వ స్థానంలో ఉంది. నివేదిక ప్రకారం, 2019 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2020 రెండో త్రైమాసికంలో నివాస ఆస్తి ధరలు 2.3 శాతం తగ్గాయి. 2020 మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండవ త్రైమాసికంలో 1.6 శాతం తగ్గుదల ఉంది. 

గ్లోబల్ హౌస్ ధరల సూచీ ప్రకారం, టర్కీ వార్షిక ప్రాతిపదికన నివాస ఆస్తి ధరలలో అతిపెద్ద పెరుగుదలను చూసింది. 2019 రెండవ త్రైమాసికంతో పోలిస్తే 2020 రెండవ త్రైమాసికంలో ధరలు 25.7 శాతం పెరిగాయి. 2019 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2020 రెండవ త్రైమాసికంలో ధరలు 17.4 శాతం పెరిగాయి. 

రెండవ త్రైమాసికంలో, మొత్తం 56 దేశాలలో వార్షిక రేటులో సగటున 4.7 శాతం మార్పు జరిగింది. మొదటి త్రైమాసికంలో సగటున 4.4 శాతం మార్పు ఉంది. యూరోపియన్ యూనియన్ రెండో త్రైమాసికంలో టాప్ -10 సూచీ జాబితాలో 8 దేశాలను కలిగి ఉంది. 

నివాస ఆస్తులకు తక్కువ డిమాండ్ ఉన్నందున భారతదేశంలోని చాలా వరకు మార్కెట్లు ప్రభావితమవుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ షిషిర్ బైజల్ తెలిపారు. కోవిడ్ -19 కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం రియల్ ఎస్టేట్ రంగాన్ని, గృహాలను కొనుగోలు చేసే ప్రజల సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది. 

ధరల తగ్గింపు వినియోగదారులకు ప్రయోజనకరమని, వారు కొనాలని నిర్ణయించుకోవచ్చని నివేదిక తెలిపింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించడం కూడా ఇల్లు కొనడానికి సరైన ప్రేరణను అందిస్తుందని నివేదిక వివరించింది.