ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ ఇంకా స్థిరపడాలి  

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ ఇంకా స్థిరపడాల్సిన అవసరం ఉన్నదని రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నదన్న ఆయన జూన్‌, జూలైలో కోలుకున్న కొన్ని రంగాలు ప్రస్తుతం స్తంభించిపోయాయని, అయినప్పటికీ ఈ ఏడాది చివరి నాటికి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నదన్న నమ్మకాన్ని  వ్యక్తంచేశారు. 
 
ఫిక్కీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతికూలానికి పడిపోయిందన్న తొలి త్రైమాసిక గణాంకాలు నిరూపితమయ్యాయని, తిరిగి గాడిలో పెట్టడానికి ఆర్బీఐ, అటు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. 
 
మరోవంక  కరోనా వైరస్‌తో పన్ను వసూళ్ళపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (సెప్టెంబర్‌ 15 నాటికి) అడ్వాన్స్‌ పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 22.5 శాతం తగ్గి రూ.2,53,532.30 కోట్లకు పడిపోయినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. 
అంతక్రితం ఏడాది రూ.3,27,320.20 కోట్ల మేర వసూలయ్యాయి. 
ఈ మహమ్మారి కారణంగా ముందస్తు పన్ను చెల్లించేవారు తగ్గిపోయారని పేర్కొంది. దీంట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.1,47,004.6 కోట్లు వసూలవగా, రూ.99,126.20 కోట్ల కార్పొరేట్‌ ట్యాక్స్‌ వసూలైనట్లు తెలిపింది. ఆర్థిక రాజధాని ముంబై 13.9 శాతం తగ్గగా, బెంగళూరు జోన్‌  9.9 శాతం పెరుగడం విశేషం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30.92 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.1.06 లక్షల కోట్ల రిఫండ్స్‌ చెల్లించినట్లు సీబీడీటీ వెల్లడించింది. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు 29.17 లక్షల మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రూ.31,741 కోట్లు, 1.71 లక్షల మంది కార్పొరేట్‌ ట్యాక్స్‌ కింద రూ.74.729 కోట్లు చెల్లించింది.