కరోనా వల్ల దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయం 85 శాతం పడిపోయిందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి త్రైమాసికమైన ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.3,651 కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయని, ఈ నష్టం 85.7 శాతమని చెప్పారు.
2019 ఏప్రిల్-జూన్ మధ్య ఎయిర్ పోర్టు ఆపరేటర్స్ ఆదాయం రూ.5,745 కోట్లు ఉండగా 2020 ఏప్రిల్-జూన్ మధ్య రూ.894 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని వివరించారు. విమానాశ్రయాల్లో ఉద్యోగుల శాతం 7.07 తగ్గిందని తెలిపారు. మార్చి 31 నాటికి 74,887 మంది ఉద్యోగులు ఉండగా జూలై 31కి ఈ సంఖ్య 69,589గా ఉందన్నారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలలో ఉద్యోగుల సంఖ్య కూడా ఏప్రిల్-జూలై మధ్య 22.44 శాతం మేర 29,254కి తగ్గిందని పేర్కొన్నారు.
మొత్తంగా దేశీయ విమానయాన సంస్థల ఆదాయం 2019 ఏప్రిల్-జూన్ మధ్య రూ.25,517 కోట్లు ఉండగా 2020 ఏప్రిల్-జూన్ మధ్య రూ.3,651 కోట్లకు పడిపోయిందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఎయిర్ ఇండియా ఆదాయం కూడా బాగా తగ్గిందని చెప్పారు. 2019 ఏప్రిల్-జూన్ మధ్య రూ.7,066 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయం రూ.1,531కి పడిపోయినట్లు తెలిపారు.
కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి మే 25 వరకు దేశీయ విమాన సేవలను నిలిపివేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. దీంతో దేశీయ విమాన ట్రాఫిక్ మార్చి నుంచి జూలై మధ్య గత ఏడాదిలో 5.85 కోట్లు ఉండగా ఈ ఏడాది 1.2 కోట్లకు పడిపోయిందన్నారు.
అంతర్జాతీయ విమాన ట్రాఫిక్ మార్చి నుంచి జూలై మధ్య గత ఏడాది 93.45 లక్షలు ఉండగా ఈ ఏడాది ఈ కాలంలో 11.55 లక్షలకు తగ్గినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇంకా పునరుద్ధరించని విషయాన్ని గుర్తు చేశారు.
మే నుంచి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమానాలు, ఇతర దేశాలతో సంబంధాల నేపథ్యంలో జూలై నుంచి భారత్ ఆయా దేశాల మధ్య విమానాలు నడుస్తున్నట్లు హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
More Stories
చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!
14 వరద బాధిత రాష్ట్రాలకు రూ. 5858 కోట్లు విడుదల
టాటా గ్రూప్లోని రెండు ఎయిర్‌లైన్స్ విలీనం