జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ అరెస్ట్‌

జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ అరెస్ట్‌
ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం 11 గంటల పాటు విచారించిన అనంతరం అరెస్టు చేశారు. సోమవారం ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కుటుంబానికి సైతం సమాచారం అందించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 
 
అల్లర్లకు సంబంధించి ఖలీద్‌ను ఈ నెల 2న ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ రెండు గంటల పాటు ప్రశ్నించింది. అల్లర్లకు సంబంధించిన మరో కేసులో గతంలో కఠినమైన చట్టవ్యతిరేక కార్యాకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. ఫిబ్రవరిలో పౌరసత్వ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసన నేపథ్యంలో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ఉమర్‌ ఖలీద్‌ పేరు నమోదైంది. అరెస్టు అనంతరం మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఆగస్ట్‌లో కూడా ఉమర్‌ ఖలీద్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మూడు గంటల పాటు విచారించారు. ఫిబ్రవరి 24న ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలు చెలరేగాయి. పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన హింసలో 53 మంది వరకు మరణించగా సుమారు 200 మంది గాయపడ్డారు. హింసను నిరోధించే ప్రయత్నంలో 108 మంది పోలీసులకు గాయాలు కాగా, ఇద్దరు మృత్యువాతపడ్డారు. 
 
అల్లర్లలో పాల్గొన్న వ్యక్తులందరి పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని, ఈశాన్య ఢిల్లీలో హింసను వ్యవస్థీకృతం చేయడంలో, మత విద్వేశాలను, విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఈ ఘటన జరిగిందని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.  ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 751 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
 
దర్యాప్తు విషయానికి వస్తే ఢిల్లీ పోలీస్‌ అత్యంత పొఫెషనల్‌గా కేసుగా తీసుకుందని అధికారులు పేర్కొన్నారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాత.. చాలా ముఖ్యమైన కేసుల్లో దర్యాప్తును ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. విచారణ కోసం కోర్టులో చార్జీషీట్లు దాఖలు చేశామని పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి. 
 
అల్లర్లలో ప్రైవేట్‌, పబ్లిక్‌ ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం కలిగింది. ఇప్పటి వరకు 751 కేసుల్లో 1,575 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు సంబంధించిన కేసుల్లో 250కిపైగా చార్జిషీట్లు దాఖలు కాగా, అందులో 1,153 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు.