సైనికుల వెంట  యావత్ దేశం 

యావ‌త్ దేశం సైనికుల వెంట నిలిచి ఉంద‌న్న సంకేతాన్ని పార్ల‌మెంట్ ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేశారు.  ఇవాళ వ‌ర్షాకాలా స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  చాలా భిన్న‌మైన స‌మ‌యంలో పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని గుర్తు చేశారు. 
 
ఒక‌వైపు కరోనా, మ‌రో వైపు విధి నిర్వ‌హ‌ణ ఉంద‌ని, కానీ ఎంపీలంతా త‌మ డ్యూటీకే ప్రాధాన్య‌త ఇచ్చార‌ని, ఎంపీలంద‌రికీ తాను కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. రాజ్య‌స‌భ, లోక్‌స‌భ‌లు రెండు వేరువేరు స‌మ‌యాల్లో జ‌రుగుతాయ‌ని, శ‌ని-ఆదివారాల్లోనూ స‌మావేశాలు ఉంటాయ‌ని, దీనికి ఎంపీలంద‌రూ ఆమోదం తెలిపిన‌ట్లు మోదీ చెప్పారు. 
 
నోవల్ క‌రోనా వైర‌స్‌కు మందు రానంత వ‌ర‌కు నిర్ల‌క్ష్యం వ‌ద్దు అంటూ మోదీ మ‌రోసారి స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చారు.  క‌రోనా వైర‌స్‌కు వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ వ‌స్తే బాగుంటుంద‌ని పేర్కొన్నారు. మ‌న శాస్త్ర‌వేత్త‌లు కూడా వ్యాక్సిన్ త‌యారీలో స‌క్సెస్ సాధించిన‌ట్లు మోదీ తెలిపారు. 
 
ఇక చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు అంశాన్ని కూడా మోదీ ప్ర‌స్తావించారు.  యావ‌త్ దేశం మొత్తం సైనికుల వెంటే ఉంద‌న్న సంకేతాన్ని పార్ల‌మెంట్ స‌భ్యులు వినిపిస్తార‌ని భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.
 
క‌రోనా ప్ర‌భావం త‌ర్వాత మొద‌ట‌సారిగా పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ది. క‌రోనా నేప‌థ్యంలో పార్ల‌మెంట్ సిబ్బందితోపాటు, స‌భ్యులంద‌రికీ ‌క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. నెగెటివ్ వ‌చ్చిన‌వారికే స‌భ‌లోకి అనుమ‌తి ఇస్తున్నారు. 
 
క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ లోక్‌స‌భ కోలువుదీరింది. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ స‌హా ఇటీవ‌ల మ‌ర‌ణించిన ప్ర‌ముఖులకు లోక్‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది. అనంత‌రం స‌భా స‌మ‌యం కుదింపు, క్వ‌శ్చ‌న్ అవ‌ర్ ర‌ద్దు‌, జీరో అవ‌ర్ కుదింపు వంటి అంశాల‌పై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషీ లోక్‌స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.  
 
ఇటీవ‌ల మ‌ర‌ణించిన మాజీ రాష్ట్ర‌పతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి లోక్‌స‌భ నివాళి అర్పించింది.  స్పీక‌ర్ ఓం బిర్లా మాట్లాడుతూ ప్ర‌ణ‌బ్‌కు ఘ‌న నివాళి అర్పిస్తూ  ప్ర‌ణ‌బ్ అయిదు ద‌శాబ్ధాల పాటు ప్ర‌జాసేవ‌లో ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ఎంపీ వ‌సంత్ కుమార్ మృతి ప‌ట్ల కూడా స్పీక‌ర్ నివాళి అర్పించారు. పండిట్ జ‌శ్‌రాజ్ మృతి ప‌ట్ల కూడా స‌భ నివాళి అర్పించింది. మాజీ ఎంపీ చేత‌న్ చౌహాన్ మృతికి కూడా స్పీక‌ర్ నివాళి అర్పించారు. 
 
క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన క‌రోనా యోధుల‌కు కూడా పార్ల‌మెంట్ నివాళి అర్పిచింది.  హెల్త్ కేర్ ప్రొఫెష‌న‌ల్స్‌, శానిటేష‌న్ వ‌ర్క‌ర్లు, వాలంటీర్ల మృతి ప‌ట్ల స్పీక‌ర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. నివాళి ప్ర‌క‌ట‌న‌ త‌ర్వాత స‌భ‌ను స్పీక‌ర్ బిర్లా గంట సేపు వాయిదా వేశారు. 
 
మొద‌టిసారిగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ వేర్వేరు స‌మ‌యాల్లో కోలువుదీరుతున్నాయి. ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు లోక్‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌ధ్యాహ్నం నుంచి రాజ్య‌స‌భ స‌మావేశం కానుంది. అయితే రేప‌టి నుంచి 9 గంట‌ల‌కు రాజ్య‌స‌భ‌, మ‌ధ్యాహ్నం నుంచి లోక్‌స‌భ స‌మావేశాలు జ‌రుతాయి.