ప్రపంచ వ్యాక్సిన్  తయారీ కేంద్రంగా హైదరాబాద్ !

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడమే మార్గమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. వ్యాక్సిన్ ను తీసుకు అందించడంకోసం  ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో మంది శాస్త్రవేత్తలు నిర్విరామ కృషిచేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి.

అయితే, వీటిని అభివృద్ధి చేయడం ఒక ఎత్తయితే వీటి ఉత్పత్తి మరో ఎత్తు. దీనిని సమర్థంగా నిర్వహించగల సత్తా ప్రపంచంలోనే కేవలం చైనా, భారత్‌కు మాత్రమే ఉన్నాయి.  ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్ లలో మూడోవంతు తయారు చేయగల  మౌలిక సదుపాయాలు హైదరాబాద్ కు మాత్రమే ఉన్నాయి. దానితో వాక్సిన్ ను ఎవ్వరు కనుగొన్న దానిని ఉత్పత్తి చేయవలసింది మాత్రం హైదరాబాద్ లోనే కానున్నది. 

దేశ మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ -19 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌, రష్యా స్పుత్నిక్ వీ, జాన్సన్ అండ్‌ జాన్సన్ కంపెనీ ఏడీ 26.సీఓవీ2ఎస్‌, ఫ్లూజెన్ కోరోఫ్లూ, సనోఫీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు హైదరాబాద్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. అంటే వాటి ఉత్పత్తి కోసం ఇక్కడి కంపెనీలతో టచ్‌లో ఉన్నాయి. 

వ్యాక్సిన్‌ అనేది హైదరాబాద్‌లో అభివృద్ధి చేసినా లేదా ప్రపంచంలో ఎక్కడ తయారైనా ఉత్పత్తి, సరఫరా మాత్రం హైదరాబాద్‌నుంచే కావాల్సిందేనని శాంత బయోటెక్నిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. సనోఫీ కంపెనీ టీకాను 2021 మొదటి భాగంలో ఇక్కడ పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు వరప్రసాద్‌రెడ్డి ఎదురుచూస్తున్నారు.  సనోఫీ కంపెనీ 2009 లో శాంత బయోటెక్నిక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచంలోనే అనువైన ప్రదేశం హైదరాబాద్‌ మాత్రమేనని, ఇది టీకా తయారీ సామర్థ్యం కలిగి ఉందని బయోలాజికల్ ఇ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల పేర్కొన్నారు. ఈ కంపెనీ సొంతంగా టీకా అభివృద్ధి కోసం టెక్సాస్‌లోని బేలర్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌లో తయారుచేసేందుకు సాంకేతిక సహాయాన్ని అందజేస్తున్నది. 

ఇదిలా ఉండగా,  ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయం సహకారంతో అభివృద్ధి చెందుతున్న తమ సొంత టీకా అనుమతి పొందేందుకు 18 నెలల సమయం పడుతుందని, ఆలోగా ఇతర కొవిడ్ -19 వ్యాక్సిన్ల తయారీకి తాము సిద్ధంగా ఉన్నామని ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కే ఆనంద్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌లోని అరబిందో ఫార్మా కూడా ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన ఆర్ అండ్ డీ కంపెనీని కొనుగోలు చేయడంతో కొవిడ్ -19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ బ్యాండ్‌వాగన్‌పైకి దూసుకెళ్లింది.