గల్వాన్‌లో 60 మంది చైనా సైనికుల మృతి  

గల్వాన్‌ లోయలో జూన్‌ 15 న భారత్‌-చైనా మధ్య జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన 60 మంది చనిపోయిన్నట్లు  అమెరికాకు చెందిన వార్తా పత్రిక న్యూస్‌ వీక్‌ సెప్టెంబర్‌ 11 నాటి సంచికలో వెల్లడించింది. పీఎల్‌ఏ తోకముడుస్తుందని చైనా ఏనాడూ భావించలేదని, దుందుడుకుగా వ్యవహరించే జిన్‌పింగ్‌కు ఇది పెద్ద అపజయంగా భావించాలని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

భారత్‌తో ఇటీవల ఘర్షణకు దిగటం ద్వారా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ స్వీయ నాశనాన్ని కొనితెచ్చుకున్నాడని న్యూస్‌ వీక్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. భారత్‌తో సరిహద్దు ఘర్షణకు స్వయంగా జిన్‌పింగే వ్యూహరచన చేశాడని, కానీ భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టడంతో భంగపాటుకు గురయ్యాడని పేర్కొంది. 

ఇప్పటికే చైనా ప్రజలతోపాటు పాలక కమ్యూనిస్టు పార్టీ లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న జిన్‌పింగ్‌కు భారత సైన్యం చేతిలో భంగపాటు శరాఘాతంలా తాకిందని పేర్కొంది.  న్యూస్‌ వీక్‌ పత్రిక కథనం ప్రకారం ఈ వైఫల్యం తరువాత సైన్యంలో విధేయులను నియమించుకోవాలని చైనా సైన్యం జిన్‌పింగ్‌కు సూచించింది. 

ఈ కథనంలో చైనాకు చెందిన ఎంత మంది సైనికులు చనిపోయింది వెల్లడించేందుకు చైనా ప్రభుత్వం ముందుకు రాకపోవడం వారి తప్పిదమే. గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించారని భారత ప్రభుత్వం వెల్లడించగా చైనా పీఎల్‌ఏ ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించింది.

ఆనాటి ఘర్షణలో చైనాకు చెందిన దాదాపు 60 మంది మరణించారని కథనంలో వెల్లడించారు. మరెందరో గాయపడ్డారని కూడా కథనం తెలిపింది. వాస్తవానికి, మే నెల ప్రారంభంలో చైనా దళాలు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) కి దక్షిణంగా ముందుకు సాగాయి. లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య మూడు వేర్వేరు ప్రాంతాల్లో తాత్కాలిక సరిహద్దు ఉంది. 

చైనా సైన్యం భారత సరిహద్దులోకి ప్రవేశిస్తూనే ఉన్నది. 2012 లో జిన్‌పింగ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తరువాత నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు మరింత ఎక్కువయ్యాయి. గల్వాన్‌లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ 40 ఏండ్ల తరువాత మొదటి ప్రమాదకరమైన ఘర్షణ. ఆగస్టు నెల చివరలో 50 సంవత్సరాలలో మొదటిసారి భారత్‌ దూకుడు వైఖరిని ప్రదర్శించింది.

చైనా స్వాధీనం చేసుకున్న అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలను భారతదేశం తిరిగి తన వశం చేసుకుంది. ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నాలను భారత జవాన్లు అడ్డుకోవడంతో చైనా సైన్యం షాక్‌కు గురైంది. ఆశ్చర్యపోయిన చైనా సైనికులు వెనక్కి తిరిగి రావలసి వచ్చింది. చొరబాటుదారులకు భారత్‌ అవకాశం ఇవ్వడం లేదని న్యూస్‌ వీక్‌ తన కథనంలో స్పష్టంచేసింది.