రాష్ట్రపతి, ప్రధానిలతో సహా 10 వేల మందిపై చైనా నిఘా!

దేశ సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం సృష్టించడం, సరిహద్దులను చెరిపేయాలన్న కుట్ర పన్నడం, బలగాలను మోహరించడం, ఒప్పందాలను ఉల్లంఘించడం వంటి చైనా పన్నిన కుట్రలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కనిపించని మరో కుట్ర తాజాగా బయటపడింది. 

రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి బాబ్డేలతో సహా కేంద్ర మంత్రులపై గూఢ చర్యం చేయడానికి చైనా కుట్ర పన్నింది. ఈ మేరకు కొన్ని కంపెనీలతో చైనా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది.

ఈ విషయాన్ని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. చైనాకు చెందిన ‘షెన్‌జేన్’ సంస్థ నేతృత్వంలో చైనా గూఢచర్యానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ షెన్‌జేన్ సంస్థకు చైనా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉందని ఆ  పత్రిక పేర్కొంది. 

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా వస్తువులు, యాప్‌లపై విధించిన నిషేధం, సరిహద్దు సమస్య మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని చైనా ఈ దుశ్చర్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ మాత్రమే కాకుండా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు…ఇలా దాదాపు 10 వేల మందిపై చైనా గూఢ చర్యానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.  

ఆ పది వేల మందిలో ముఖ్యంగా రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ బాబ్డే, రాజ్‌నాథ్, పీయూశ్ గోయల్, సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు సోనియా గాంధీ, ఆమె కుటుంబం, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్ ఉన్నారు.

ఈ ప్రముఖులందరి డిజిటల్ జీవితాలను చైనా కంపెనీలు అనుసరిస్తున్నాయని, అలాగే వారి కుటుంబీకులు, మద్దతు దారులు పని తీరుపై కూడా చైనా కంపెనీ నిఘా పెట్టినట్టు ఆ పత్రిక పేర్కొంది. అంతేకాకుండా ఈ పదివేల మంది ప్రముఖుల ‘రియల్ టైమ్ డేటా’ ను కూడా చైనా కంపెనీలు సిద్ధం చేసుకున్నాయి. 

ఈ పూర్తి దర్యాప్తు కోసం షెన్‌జాన్ సంస్థ, చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ‘ఇన్ఫర్మేషన్ డాటా’ స్థావరాన్ని సృష్టించి, ఈ మిషన్ నడుపుతున్నాయని ఆ  పత్రిక తెలిపింది.

కాగా, భారత నిఘా సంస్థలకు ఈ విషయంపై ముందుగానే సమాచారం ఉందని  కేంద్రంపేర్కొంది. ‘ఇటువంటి కారణాల రీత్యానేన చైనా యాప్‌లను నిషేధించాలనే నిర్ణయానికి వచ్చాము’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు వ్యాఖ్యానించారు. ప్రధాని వంటి వీఐపీలకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సైతం భారత వ్యతిరేక కార్యకలాపాలకు శత్రు దేశాలు వినియోగించవచ్చని తెలిపారు.