ప్రతి పది మందిలో ఒకరి ఉద్యోగం ఫట్‌!

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం విళయతాండవం చేస్తోంది. భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సిఎంఐఇ) సర్వేలో జాతీయ స్థాయి నిరుద్యోగిత రేటు 8.35 శాతంగా నమోదైంది. 
 
జులైలో 7.43 శాతం ఉంటే.. ఆగస్టు నాటికి 8.35 శాతానికి చేరింది. పట్టణాల్లో వ్యాపారాలు కుదేలవ్వడంతో అందులో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు పోతున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ప్రతి పది మందిలో ఒకరి ఉద్యోగం పోయినట్లు సర్వే వెల్లడిస్తోంది. 
 
వీరిలో 30 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో నిరుద్యోగం రేటు కొంత తగ్గినట్లు సర్వే వెల్లడించింది. జులైలో 9.1 శాతం ఉంటే, ఆగస్టు నెలాఖరుకు 5.8 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే హరియాణాలో అత్యధికంగా 33.5 శాతంగా నమోదైంది. ఆ తరువాత త్రిపురలో 27.9 శాతంగా ఉంది. 
 
మొత్తం 13 రాష్ట్రాల్లో 13 శాతం కన్నా ఎక్కువగా ఉంది. సర్వే చేసిన నెలల్లో 15.5 శాతం మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. మరో 21.7 శాతం మందికి చేసేందుకు పని లేకుండాపోయింది. కొందరికి ఏప్రిల్‌ నెలకు వేతనాలు కూడా అందలేదు. 
 
కరోనాకు ముందుతో పోల్చితే ఏప్రిల్‌, మే నెలల్లో ఆదాయం 48 శాతం పడిపోయింది. కరోనా కారణంగానే ఉద్యోగాలు పోయాయని 90 శాతానికి పైగా అభిప్రాయపడ్డారు.