నవ భారత నిర్మాణానికి నితీశ్ గొప్ప కృషి

నవ భారతం, నవ్య బిహార్ కోసం  బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌విశేష కృషి చేస్తున్నట్లు   ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూట‌మిలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌ది కీల‌క‌పాత్ర అని కొనియాడారు. 
 
మ‌రికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో మాట్లాడిన ప్ర‌ధాని ఆధునిక భార‌త‌దేశం, ఆధునిక బీహార్ నిర్మాణంలో నితీశ్‌కుమార్ కీల‌కపాత్ర పోషించార‌ని చెప్పారు.   త్వరలో బిహార్‌లో జరిగే శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే సారథి నితీశ్ అని స్పష్టమైన  సంకేతం ఇచ్చారు. 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ. 900 కోట్ల విలువైన 3 పెట్రోలియం ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో పారాడిప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ ప్రాజెక్టులోని దుర్గాపూర్-బంకా విభాగం మరియు రెండు ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు చేరేలా చూడడంలో బీహార్ పరిపాలన ఆదర్శప్రాయంగా ఉందని ప్రదాని మోదీ అన్నారు.
 
ఆది నుంచి బీహార్ ఎన్నో స‌వాళ్లను ఎదుర్కొన్న‌ద‌ని, నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకున్న‌ద‌ని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. 
 
 ఓటు బ్యాంకు రాజ‌కీయాలు, నిధుల కొర‌త లాంటివి బీహార్ అభివృద్ధిలో వెనుక‌బ‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని ఆయ‌న‌ ధ్వజమెత్తారు. ఒక‌ప్పుడు బీహార్‌లో ర‌హ‌దారుల అనుసంధానం, ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లాంటి అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చేవే కావ‌ని గుర్తుచేశారు.