బీహార్ లో కలిసే పోటీచేస్తాం 

రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సీట్ల ఒప్పందంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ల మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సీట్ల పంపకంపై చర్చించారు.

రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను నితీష్‌ కుమార్‌ నాయకత్వంలో ఐక్యంగా ఎదుర్కొంటామని, భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటామని ప్రకాష్‌ నడ్డా తేల్చి చెప్పారు. 

ఇటీవల రాంవిలాస్‌ పాశ్వాన్‌ నాయకత్వంలోని ఎల్‌జేపీ, జేడీయూపై వివిధ అంశాలపై తీవ్రంగా విభేదిస్తూ, జేడీయూతో కలిసి పోటీచేయలేమని ప్రకటించింది. ఎల్‌జేపీతో, జేడీయూకి తలెత్తిన విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ చొరవ తీసుకుంటుందని నితీష్‌ కుమార్‌కి హామీయిచ్చారు. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల కమిషన్‌ త్వరలోనే ప్రకటించనుంది.   మరోవంక, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో రాంచీలో భేటీ అయ్యారు. రానున్న బిహార్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.  ఎన్నికల్లో జేఎంఎం 12 స్థానాలను డిమాండ్‌ చేయగా, ఆర్జేడీ దాదాపు 3 సీట్లే ఇవ్వగలమని చెప్పినట్లు తెలుస్తోంది.