భారత వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్గాన్‌‌‌ను వాడొద్దు

భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్‌‌‌ను వినియోగించరాదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌‌లో శాంతి నెలకొనాలనే విషయంపై దోహాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైశంకర్ పాల్గొంటూ పొరుగు దేశమైన అఫ్గాన్‌‌లో శాంతి నెలకొనడానికి తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను చెప్పారు. 
 
‘భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్ గడ్డను వినియోగించొద్దని మా అంచనా. అఫ్గాన్‌‌‌లో సుస్థిర శాంతి నెలకొనేలా చర్యలు మొదలవ్వాలి. ఆ దేశ సార్వభౌమత్వన్ని గౌరవించాలి. అలాగే అఫ్గాన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలి. ఆ దేశం‌‌‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు వాటి గురించి ప్రచారం చేయాలి’ అని జైశంకర్ పేర్కొన్నారు.  
ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వ నేతృత్వంలో, నియంత్ర‌ణ‌లో చ‌ర్చ‌లు సాగాలని చెబుతూ  శాంతి చ‌ర్చ‌ల‌కు భార‌త్ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఆఫ్ఘ‌నిస్తాన్ జాతీయ సార్వ‌భౌమ‌త్వాన్ని, భూభాగాన్ని  గుర్తించి చ‌ర్చ‌లు సాగాల‌ని సూచించారు.  స‌మాజంలోని అణ‌గారిన వ‌ర్గాల వారి గురించి కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.
ఆఫ్ఘ‌నిస్తాన్‌లో హింస‌ను రూపుమాపాల‌ని చెబుతూ ఆ దేశంతో భార‌త్ సుమారు మూడు బిలియ‌న్ల డాల‌ర్ల ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు జైశంక‌ర్ తెలిపారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో సుమారు 400 అభివృద్ధి ప్రాజెక్టులు భార‌త్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.
రెండు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.  అబ్దుల్లా అబ్దుల్లా, తాలిబ‌న్ డిప్యూటీ నేత ముల్లా అబ్దుల్ ఘ‌ని బ‌రాదార్, అమెరికా మంత్రి మైక్ పాంపియోలు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.