సోషల్ మీడియా పుకార్లకు న్యాయమూర్తులూ బాధితులే 

ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులు ఆకర్షణీయమైన పుకార్లు, బురదజల్లే సోషల్ మీడియా పోస్టింగ్‌లకు బలవుతున్నారని, ఎందుకంటే వారు బహిరంగంగా తమ వాదన చెప్పుకునే అవకాశం లేకపోవడమే దీనికి కారణమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ
ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జీలు దంతపు భవంతుల్లో గడుపుతారన్న అపోహ ఒకటి దేశం లో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రజలు తాము ఏది అనుకుంటే దాన్ని మాట్లాడకుండా ఏ చట్టాలయితే నిరోధిస్తున్నాయో అవే చట్టాలు న్యాయమూర్తుల భావ ప్రకటనా స్వేచ్ఛకు అడ్డంకిగా ఉంటున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే అంటూ, ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రతికూలంగా ఉందని హెచ్చరించారు.

శనివారం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ బానుమతి రాసిన ‘జ్యుడీషియరీ, జడ్జి అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ అన్న పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులు మాట్లాడారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చినందుకు గాను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు గత నెల 31న ఒక రూపాయి జరిమానా విధించిన నేపథ్యంలో న్యాయమూర్తులు రమణ, బాబ్డే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

కాగా బానుమతి రాసిన పుస్తకం ప్రధాన ఇతివృత్తం ఒక జడ్జి బాధ్యతలు, విధులు అని ఈ సందర్భంగా జస్టిస్ రమణ తెలిపారు. ‘ జడ్జిలు తమ వాదనను వినిపించుకునే అవకాశం లేదు. అందువల్ల వారిపై సులభంగా విమర్శలు చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. సోషల్ మీడియా, టెక్నాలజీ వ్యాప్తితో ఈ అంశం మరింత సంక్లిష్టంగా మారింది. ఆసక్తికరమైనకథనాల (జ్యూసీగాసిప్స్)కు, బురదచల్లే సోషల్ మీడియా పోస్టింగ్‌లకు జడ్జ్జిలు టార్గెట్ అవుతున్నారు’ అని రమణ పేర్కొన్నారు.

జడ్జీలు స్వతంత్రంగా ఉండడం కోసం తమ సామాజిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం న్యాయమూర్తులు చేసే త్యాగాలు ఏ ఇతర వృత్తికీ తీసిపోవని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ దేశానికి చెందినదని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అంటూ ఎంతో మంది బెంచ్‌కి లోపల, బైట చూపిన తిరుగులేని అంకిత భావం, నిబద్ధత ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపారు.