మెదక్‌ అదనపు‌ కలెక్టర్‌ నగేష్‌ అరెస్ట్‌

మెదక్ జిల్లాలోని చిప్పలతుర్తి గ్రామంలోని 112.21 ఎకరాల భూమికి సంబంధించి ఎన్‌వొసి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న రూ.1.12 కోట్ల లంచం కుదుర్చుకొని, అందులో  రూ. 40 లక్షలు తీసుకుంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఎసిబి అధికారులకు బుధవారం అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసు లో కీలక పాత్ర వహించిన నర్సాపూర్ ఆర్‌డివొ బి.అరుణారెడ్డి, ఎంఆర్‌వొ అబ్దుల్‌సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసీం అహ్మద్, ప్రవేట్ వ్యక్తి కోలా జీవన్‌గౌడ్‌లన ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి నివాసి లింగమూర్తి ఈ ఏడాది ఫిబ్రవరి 29న నర్సాపూర్ మండలంలోని చిప్పలతుర్తి గ్రామంలోని 112.21 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం ఎన్‌ఒసి కోరుతూ జూలై 21న పత్రాలను ఎంఆర్‌ఒ అబ్డుల్ సత్తార్‌లతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఆర్‌డిఒ అరుణారెడ్డిలకు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పదవీ విరమణ పొందటంతో ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ జూలై 31న ఎన్‌ఒసి ఇచ్చేందుకు ఒక ఎకరా కు రూ.లక్ష చొప్పున 122ఎకరాలకు రూ. 1.12కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

రూ.40 లక్షల నగదుతో పాటు తన పేరిట రూ.72లక్షల విలువైనభూములు రిజిస్ట్రేషన్‌కు ఒప్పందం కుదిరింది. తొలివిడత రూ.19.5 లక్షల లంచం తీసుకుని మరో విడతకు సంబంధించిన రూ. 20.5 లక్షలు ఆగస్టు 5న తీసుకున్నాడు. మిగిలిన రూ. 72లక్షల నగదు సర్థుబాటు కాకపోవడంతో 112 ఎకరాల భూమిలో 5 ఎకరాలను అదనపు కలెక్టర్ నాగేష్ తన బినామీ అయినటువంటి సికింద్రాబాద్ నివాసి కోలా జీవన్‌గౌడ్ పేరిట ఆగస్టు 21న అగ్రిమెంట్ చేసుకోవడంతో పాటు 8 బ్లాంక్ చెక్‌లను తీసుకున్నాడు.

అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ వాసీం అహ్మద్ జూలై 31 లింగమూర్తి నుంచి తన వాటా మొత్తంగా రూ.5 లక్షలు తీసుకున్నాడు. అందులో ఆర్‌డిఒ అరుణారెడ్డికి, ఎంఆర్‌ఒ అబ్దుల్ సత్తార్‌లకు రూ.లక్ష చొప్పున అందజేశాడు. అయినప్పటికీ తనకు ఎన్‌ఒసి రాకపోవడంతో ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎసిబి అధికారులు నాగేష్‌ను అదుపులోకి తీసుకుని అతని ఇంట్లో, సమీప బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించారు.

లంచంతో పాటు ఆడియో టేపులు సహా ఎసిబికి పట్టుబడ్డ అడిషనల్ కలెక్టర్ నగేష్ అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్‌ను గుర్తించారు. బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్‌డిఒ కార్యాలయం, క్యాంప్ కార్యాలయం, చీలప్ చెడు ఎంఆర్‌ఒ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే చౌదరిగూడా ఆర్‌డిఒ నివాసం, కొంపల్లి జెసి నివాసంలో సోదాలలో పెద్ద ఎత్తున నగలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. బోయిన్‌పల్లిలోని జీవన్‌గౌడ్ ఇంట్లో సోదాలు చేపట్టారు.

ఉప్పల్‌లోని మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్‌డిఒ అరుణారెడ్డి ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ. 26 లక్షల నగదుతో పాటు, అర కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  అరుణరెడ్డితో పాటు ఇతర రెవెన్యూ అధికారులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. 

సోదాల తర్వాత అదనపు కలెక్టర్ నగేష్, ఆర్‌డిఒ అరుణారెడ్డి, ఎంఆర్‌ఒ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసీలతో పాటు జీవన్‌గౌడ్‌ను అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఐదుగురు నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన కేసు మర్చిపోకముందే అంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు రావడం రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మెదక్ జిల్లా కలెక్టర్ రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంచార్జ్ కలెక్టర్ గా కొనసాగుతున్న అదనపు కలెక్టర్ నగేష్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ అక్రమాలకు తెరలేపినట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో నాగేష్‌కు చెందిన నాలుగు బ్యాంక్ ఖాతాలు, 2 లాకర్‌లను ఎసిబి అధికారులు గుర్తించారు. వాటిపై దర్యాప్తు సాగిస్తే మరిన్ని అక్రమ వ్యవహారాలు బయటపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.