గిరిజన యూనివర్సిటీ గురించి పట్టించుకొని కేసీఆర్ 

సొంతంగా తెలంగాణ అభివృద్ధికి ఏమీ చేయలేని కేసీఆర్ ప్రభుత్వం చివరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయూత ఇస్తున్నా నిర్లక్ష్య ధోరణితో సద్వినియోగం  చేసుకోలేకపోతున్నది.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2017లోనే గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయడమే కాకుండా, తన వంతుగా తొలి విడతగా రూ 10 కోట్లు నిధులు కూడా అందజేసింది.

అయితే ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. ములుగులో రాష్ట్రప్రభుత్వం చూపిన స్థలాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం  2017లోనే ఒకే చేసింది.  కానీ యూనివర్సిటీకి కావాల్సిన భూమిని సేకరించి ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం కావడంతో ఇంకా యూనివర్సిటీ ప్రారంభం కాలేదు. 
 
భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం విషయం తేల్చలేదు. కనీసం అటవీశాఖ భూమిపై అనుమతులుకూడా తెప్పించలేకపోయారు. ఫలితంగా యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక గిరిపుత్రులు ఆందోళన చెందుతున్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులతోపాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుఖ్బీర్ సింగ్ నేతృత్వంలోని  బృంద సభ్యులు2017లోనే ములుగులో పర్యటించారు. గట్టమ్మ దేవాలయ సమీపంలో స్థల పరిశీలన చేశారు.  2018 డిసెంబర్ 31న కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం సైతం ఈ స్థలంపై సంతృప్తి చెందారు
 
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ములుగుకు 200 కిలోమీటర్ల దూరంతోపాటు అద్భుతమైన పర్యాటక కేంద్రాలకు నెలవైన  ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు.  తరగతుల నిర్వహణకు అవసరమైన తాత్కాలిక భవనాలను కూడా పరిశీలించి ఒకే చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తనవంతుగా మొదటివిడత రూ.10 కోట్లు కేటాయించింది.
 
ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 498.04 ఎకరాల ప్రభుత్వ భూమిని గట్టమ్మ దేవాలయం వద్ద కేటాయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన 169.35 ఎకరాల భూమిని గిరిజన శాఖకు అప్పగించారు.  అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న 213 ఎకరాల భూమిని బదిలీ చేయాలని కోరుతూ ఆ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. 
 
కానీ ఇప్పటికీ అనుమతి మాత్రం రాలేదు.   మిగిలిన 115 ఎకరాల భూమి రైతుల చేతుల్లో ఉండగా భూ సేకరణ ఇంకా పూర్తి కాలేదు.  ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో తాత్కాలిక ట్రైబల్యూనివర్సిటీని ఏర్పాటుచేసి 2019 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని  కేంద్ర ప్రభుత్వ అధికారులు తొలుత భావించారు.  అడ్మిషన్లకు సెప్టెంబర్‌‌‌‌మొదటి వారంలో నోటిఫికేషన్‌‌‌‌ వేస్తామని ప్రకటించారు. 
 
నోటిఫికేషన్ బాధ్యతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి అప్పగించారు. కానీ పలు సాంకేతిక సమస్యల వల్ల ఆ ఏడాది నోటిఫికేషన్ వెలువడలేదు. ఈసారి కరోనా కారణంగా ఇప్పటికి నోటిఫికేషన్ ముచ్చటే ఎత్తడంలేదు. 
 
దీనిపై రాష్ట్ర సర్కారు చొరవ చూపి, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడితే ఏమైనా ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ విషయమై ఎటువంటి ఆదుర్ధా కనబడటం లేదు.