రాజ్ భవన్ కాదు..ఇది ప్రజా భవన్

తాను ఉండేది రాజ్ భవన్ కాదని, దానిని ప్రజలు ప్రజాభవన్‌‌గా భావించాలని తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ సూచించారు. గవర్నర్  గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరమైనా సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు కూతురిగా, తెలంగాణ సోదరిగా ఇక్కడి ప్రజలకు గవర్నర్ గా సేవ చేయడం తనకు గర్వంగా ఉందని తెలిపారు. 

ఏడాది పదవీ కాలంలో తెలంగాణ ప్రజలు తన మీద చూపిన ప్రేమ, ఆప్యాయతలకు సెల్యూట్  చేస్తున్నానని పేర్కొంటూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం చారిత్రాత్మక పోరాటం చేసి,. రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలకు నమస్కరిస్తున్నానని ఆమె చెప్పారు.

ఆరోగ్యం, విద్య, గిరిజన సంక్షేమమే తన ప్రాధాన్యాంశాలని చెబుతూ ఏడాది కాలంలో వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు గవర్నర్ తెలిపారు. ఒక డాక్టర్‌‌‌‌గా రక్తదానం‌‌ను  ప్రోత్సహించానని, కరోనా నివారణ చర్యలపై స్పందించానని ఆమె పేర్కొన్నారు.  గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించానని గవర్నర్‌‌‌‌ గుర్తు చేశారు.

హైదరాబాద్ బిర్యానీ టేస్ట్‌‌‌‌తోపాటు తెలంగాణ మాంసాహార వంటకాలను ఆస్వాదిస్తున్నానని  చెబుతూ తన ఏడాది పాలనపై ఈ–బుక్‌‌ను గవర్నర్ విడుదల చేశారు. తనను సంప్రదించాలనుకునే వారు వెబ్‌‌సైట్ లో సూచించిన ఈ – మెయిల్ ద్వారా అపాయింట్‌‌మెంట్ కోరవచ్చని గవర్నర్‌‌‌‌ సూచించారు.

కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయంలో తాను చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని బదులిచ్చారు. కరోనా చికిత్సకు ప్రభుత్వం ఒకటే ఆస్పత్రి చాలనుకుందని, కానీ తాను చెప్పాక జిల్లాకో ఆస్పత్రిని ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. 

 రాష్ట్రంలో పేదలకు కరోనా చికిత్స  అందించేందుకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. ఓ డాక్టర్గా ఈ సూచన చేస్తున్నానని ఆమె తెలిపారు. గవర్నర్‌‌గా తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రిలకు, సహకరిస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.