అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలసి నిర్వహించిన రెండు చారిత్రాత్మక ర్యాలీలకు సంబంధించిన వీడియోలతో రిపబ్లికన్ పార్టీ సాగిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానితో కలసి తాను నిర్వహించిన హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ ర్యాలీలు ఇక్కడి భారత-అమెరికన్లను తన వైపు మొగ్గుచూపించగలవని ట్రంప్ ఆశిస్తున్నారు.
మరో 4 ఏళ్లు (4 మోర్ ఇయర్స్) పేరుతో రిపబ్లికన్ పార్టీ రూపొందించిన 107 సెకండ్ల ఈ వీడియో గత ఏడాది అమెరికా సందర్శన సందర్భంగా 50 వేల మంది ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తుండగా హూస్టన్‌లోని ఎఎన్‌ఆర్‌జి స్టేడియంలో నరేంద్ర మోదీ, ట్రంప్ చేయి చేయి పట్టుకుని నడచి వస్తున్న దృశ్యంతో ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్షలాది ప్రజల సమక్షంలో జరిగిన నమస్తే ట్రంప్ ర్యాలీలో ఆ ఇద్దరు నాయకులతోపాటు ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ప్రజలకు అభివాదం చేస్తున్న క్లిప్పింగ్ కనపడుతుంది. భారత్ పట్ల అమెరికా విధేయతను తెలియచేస్తూ ట్రంప్ చేసే ప్రసంగంతో వీడియో సాగుతుంది.
భారత్‌ను అమెరికా ప్రేమిస్తుంది. భారత్‌ను అమెరికా గౌరవిస్తుంది. భారత ప్రజలకు అమెరికా ఎల్లప్పుడూ నమ్మకమైన, విధేయ మిత్రునిగా ఉంటుంది అంటూ ట్రంప్ ప్రసంగించడంతో వీడియో ముగుస్తుంది.
కాగా, గత నెల రిపబ్లికన్ జాతీయ మహాసభ సందర్భంగా ట్రంప్ ప్రచార కమిటీ 4 మోర్ ఇయర్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో అమెరికా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాను ఈ వీడియోను మొదటిసారి చూసినపుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని, లేచి నిలబడి కేరింతలు కొట్టాలని అనిపించిందని భారత-అమెరికన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మాయా పురి తెలిపారు.
మిషిగన్, పెన్‌సిల్వేనియా, ఓహియో వంటి రాష్ట్రాలలో రిపబ్లికన్లకు కాని డెమక్రాట్లకు కాని ఏమాత్రం పట్టులేదు. అధ్యక్ష ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా ఈ రాష్ట్రాలలోని భారత్ -అమెరికన్లు ఉండడంతో రిపబ్లికన్ పార్టీ విడుదల చేసిన ఈ వీడియో పెను ప్రభావమే చూపించే అవకాశం కనపడుతోంది.
More Stories
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత