మత్స్యరంగం కోసం `మత్స్య సంపద యోజన’  

మత్స్య రంగానికి ఊతమిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)తో పాటు ఈ-గోపాల యాప్ ను  డిజిట‌ల్ విధానం ద్వారా ప్రారంభిస్తున్నారు. దేశంలోని మత్స్య రంగ అభివృద్ధే లక్ష్యంగా తీసుకొస్తున్న పీఎంఎంఎస్‌వై పథకం అమలు కోసం వచ్చే ఐదేళ్లలో రూ. 20,050 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేస్తున్నారు.
 
ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజి కింద 2020-21, 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందులో రూ.12,340 కోట్లు సముద్ర, ద్వీప ప్రాంతాలు, ఆక్వాకల్చర్ కార్యకలాపాల కోసం ఉపయోగించనుండగా, రూ.7,710 కోట్లు మత్స్యరంగ మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేయనున్నారు.
 
 2014-25 నాటికి 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తులను రాబట్టడడంతో పాటు, అదే ఆర్థిక సంవత్సరం నాటికి మత్స్య ఎగుమతుల ద్వారా రూ. లక్ష కోట్లకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా మత్స్యకారులు, ఆక్వా రైతుల ఆదాయాన్ని రెట్టింపు కావడంతో పాటు సాగు అనంతర నష్టాలను 20-25 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు. 
 
దీంతో పాటు ఈ మత్స్య రంగంలోనూ, అనుబంధ రంగాల్లోనూ అదనంగా 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఈ-గోపాల యాప్ ద్వారా విత్తన అభివృద్ధి మార్కెట్‌‌కు వేదికను ఏర్పాటు చేయడంతో పాటు…  రైతులకు నేరుగా సమాచారం అందించేలా పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది.