గృహ నిర్బంధం పట్ల సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం 

గృహ నిర్బంధం పట్ల సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం 

ప్రజాస్వామ్యంలో పార్టీల్లో తిరిగే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయటం అనైతికమని, తాము తీవ్రవాదులమా? నక్సలైట్లమా? అని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. తనను హౌస్ అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“చలో అంతర్వేది” పిలుపు ఇచ్చిన సందర్భంగా బీజేపీ, జనసేన నేతలను  గృహ నిర్బంధం చేసి, ఎవ్వరు అక్కడకు వెళ్లకుండా కర్ఫ్యూ వంటి పరిస్థితిని సృష్టించారు. 

బీజేపీ జాతీయ పార్టీ అని, హిందుత్వం కోసం ఆలోచించే పార్టీ అన్నారు. అంతర్వేది లక్ష్మి నరసింహా స్వామి రధం కాల్చేస్తే ప్రజాస్వామ్యంలో చూడటానికి కూడా హక్కు లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు హౌస్ అరెస్టు చేసిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. 

హౌస్ అరెస్టులను బీజేపీ సహించదని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎదుర్కొంటామని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. హిందుత్వ సంస్థలు చేసే పోరాటానికి బీజేపీ నైతికంగా మద్దతు ఇస్తుందని వెల్లడించారు. 

చర్చిలపై రాళ్లు వేస్తే మాత్రం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, రధాలు కాల్చివేస్తే, విగ్రహాలు ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు. టీటీడీ నిధులను ప్రభుత్వం వాడుకుంటుందని సోము వీర్రాజు ఆరోపించారు.

మరోవంక, అంతర్వేదిలో నేడు కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. కోనసీమ వ్యాప్తంగా భాజపా, జనసేన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధం చేశారు. ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. 30 పోలీసు యాక్టు అమలు కారణంగా అంతర్వేదిలో పర్యటించేందుకు నాయకులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. 

కొత్తపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పార్టీలోని ముఖ్య నాయకులను గృహనిర్బంధం చేశారు. నిన్న చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 43 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా అంతర్వేదిలో పోలీసులు భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల వారు అంతర్వేదిలో అడుగుపెట్టకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.