మళ్లీ గల్వాన్‌ తరహా దాడుల కుట్ర భగ్నం 

 
ఒక వంక చర్చలంటూనే చైనా మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించింది. లఢక్‌లో వాస్తవాధీనరేఖ (ఎల్‌ఏసీ) వెంట భారత సైనికులపై గల్వాన్‌ తరహా దాడికి చైనా సైనికులు విఫలయత్నం చేశారు. ఈటెలు, రాడ్లు, పదునైన ఆయుధాలతో భారత్‌కు చెందిన ముఖ్‌పరీ పోస్టువైపు దూసుకొచ్చారు. 
 
భారత సైనికులు అప్రమత్తంగా ఉండటంతో గాల్లోకి కాల్పులు జరిపి బెదిరించేందుకు ప్రయత్నించారు. అయినా భారత బలగాలు స్థిరంగా ఎదురు నిలువటంతో చేసేదేంలేక తోకముడిచారు. ఇంత కుట్ర చేసి కూడా భారత సైనికులే తమను రెచ్చగొట్టారంటూ చైనా విదేశాంగశాఖ బుకాయించింది. చైనా సైనికులు కాల్పులు జరిపి కవ్వించినా మన సైనికులు గొప్ప సంయమనం పాటించారని భారత సైనిక వర్గాలు తెలిపాయి.
 
భారత సైనికులతో మరోసారి భౌతిక ఘర్షణకు దిగాలన్న పక్కా ప్రణాళికతోనే సోమవారం రాత్రి భారత పోస్టులవైపు చైనా బలగాలు దూసుకొచ్చినట్టు తేటతెల్లమైంది. జూన్‌ 15న గల్వాన్‌లో భారత సైనికులను దొంగదెబ్బ తీసినట్టుగానే మరోసారి దాడులు చేసేందుకు చైనా కుట్ర పన్నిందని తాజాగా వెల్లడైన ఫొటోలు తెలుపుతున్నాయి. 
 
భారీగా ఆటోమెటిక్‌ ఆయుధాలు, ఇనుప రాడ్లు, కర్రలు, చివరన పెద్ద కత్తి వంటి అమరిక ఉన్న ఈటెలు చేతపట్టిన దాదాపు వందమంది చైనా సైనికులు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో సరిహద్దు దాటి భారత సైనికపోస్టుల వైపు దూసుకొచ్చారు. రాళ్లతో నిర్మించిన సరిహద్దు గోడను ధ్వంసం చేస్తూ ముఖ్‌పరీ పోస్టు వైపు వచ్చారు. 
 
అయితే సమీపంలోని రెచిన్‌, రెజోంగ్లా, మగర్‌ హిల్స్‌పై విధుల్లో ఉన్న భారత సైనికులు వారిని గమనించి హెచ్చరించారు. సరిహద్దు దాటితే కాల్పులు జరుపుతామని తమవద్ద ఉన్న తుపాకులను చూపారు. దాంతో చైనా సైనికులు గాల్లోకి కాల్పులు జరుపుతూ బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ భారత సైనికులు గట్టిగా ఎదురు నిలువటంతో చేసేదేమీ లేక వెనుకకు మళ్లిపోయారు.
 
తాజా ఘటనపై చైనా సైన్యం మరోసారి అబద్ధాలు వల్లెవేసింది. భారత సైనికులే మొదట కాల్పులు జరిపారని, ఎల్‌ఏసీ దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. వీటిని భారత సైన్యం తోసిపుచ్చింది. చైనా ప్రజలతోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా పీఎల్‌ఏ తప్పుడు ప్రకటనలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడింది. 
 
మరోవైపు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌పై చైనా అధికార పత్రికలు  అభ్యంతరకర కథనాలు ప్రచురించాయి. 
భారత్‌-చైనా మధ్య సరిహద్దుగా ఉన్న ఎల్‌ఏసీ వద్ద దాదాపు 45 ఏండ్ల తర్వాత తుపాకులు గర్జించాయి. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని ఉన్నత శిఖరాలను స్వాధీనం చేసుకున్న భారత సైనికులను బెదిరించేందుకు సోమవారం రాత్రి చైనా సైనికులు విఫలయత్నం చేశారు. 
 
గాల్లోకి కాల్పులు జరిపి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అంతకుముందు ఇలాంటి ఘటన 1975లో జరిగింది. ఎల్‌ఏసీ వెంట తులుంగ్‌ లా ప్రాంతంలో చైనా సైనికులు జరిపిన కాల్పుల్లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన నలుగురు భారత జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత ఇరుదేశాలూ కాల్పుల విరమణ పాటిస్తూ వస్తున్నాయి. 1996లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని చైనా ఇప్పుడు ఉల్లంఘించింది.
 
కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లో వేటకు వెళ్లి పొరపాటున చైనా భూభాగంలోకి ప్రవేశించిన ఐదుగురు భారతీయులు తమవద్దే ఉన్నారని చైనా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు కూడా ధ్రువీకరించారు. 
 
 వాస్తవాధీనరేఖ వెంట లఢక్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నదని విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు రాజకీయంగా చాలా లోతైన చర్చలు జరుగాల్సి ఉన్నదని చెప్పారు. షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీవో) సమావేశాల సందర్భంగా బుధవారం చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ ఈతో చర్చలు జరుపనున్న నేపథ్యంలో జైశంకర్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.