సుశాంత్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ 

సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన ఎన్‌సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. 

డ్రగ్స్ కేసులో రియాను మూడు రోజుల పాటు ఎన్‌సీబీ విచారించింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్‌ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది.

అయితే.. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించలేదని, కేవలం సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని రియా చెప్పుకొచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా సుశాంత్ కేసులో డ్రగ్స్ వినియోగం దగ్గర మొదలైన విచారణ, బాలీవుడ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగితేలే వారి పేర్లను రియా బయటపెట్టేవరకూ వెళ్లింది. 

మొత్తం 25 మంది బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లను ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి బయటపెట్టినట్టు సమాచారం.సోమవారం విచారణలో భాగంగా డ్రగ్స్ వ్యాపారి బాసిత్ పరిహార్‌ కనీసం ఐదు సందర్భాల్లో తమను కలిశాడని, అతనే తమ ఇంటికి వచ్చేవాడని రియా ధ్రువీకరించినట్టు తెలుస్తోంది.

మరోవంక, మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్ డీలర్ అనూజ్ కేశ్వానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. సుశాంత్ మృతి కేసులో అరెస్ట్ అయిన డ్రగ్ పెడ్లర్ కైజెన్ ఇబ్రహీం అతడి పేరును వెల్లడించాడు. దీంతో అనూజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇబ్రహీం ఇంటరాగేషన్‌లో కేశ్వానీ పేరు బయటకు రావడంతో ముంబై బాంద్రా, శాంతాక్రజ్‌లో అతడి నివాసంలో ఎన్‌సీబీ తాజాగా దాడులు నిర్వహించింది. 

కేశ్వానీ నివాసంలో దాడుల సందర్భంగా 590 గ్రాముల గంజాయి, 64 మిల్లీ గ్రాముల ఎల్‌ఎస్‌డీ షీట్లు, 304 గ్రాముల మరిజువానా, మరిజువానా జాయింట్లు, క్యాప్సుల్స్,  లక్షా 85వేల రూపాయల నగదు, 5 వేల ఇండోనేషియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్ తెలిపారు.