డ్రగ్స్ కేసులో కన్నడ నటి సంజన అరెస్ట్ 

కర్ణాటక  శాండల్‌వుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో తాజాగా మరో నటి సంజన గల్రానీని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి  పోలీసులు ప్రశ్నిస్తున్న రెండో నటి సంజనా.  ఇప్పటికే మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా ఆరోపణలతో అరెస్టైన నటి రాగిని ద్వివేదిని పోలీసులు విచారిస్తున్నారు.    

తెలుగులో తరుణ్ నటించిన సోగ్గాడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంజన బుజ్జిగాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించింది. కన్నడ చిత్రం దండుపాళ్యంలో ఆమె పోషించిన పాత్రకు సంజన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇవాళ ఉదయం బెంగళూరులో ఆమె నివాసముంటున్న ఇందిరా నగర్ ఇంట్లో సీసీబీ సోదాలు నిర్వహించింది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సీసీబీ ఆఫీస్‌లో ఆమెను విచారించనున్నారు. ఇప్పటికే సంజన స్నేహితుడైన రియల్టర్ రాహుల్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మాఫియాతో రాహుల్‌కు సంబంధాలున్నట్లు తేల్చారు.

రాహుల్ అరెస్ట్ అనంతరం సంజన కొందరు విమర్శకులకు ఘాటుగా సమాధానమిచ్చింది. డ్రగ్స్, మాఫియా సినీ తారలపై గడచిన వారం రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగిపై సంజన విరుచుకుపడింది.