“కాంగ్రెస్ ఓకే పెద్ద కుటుంభం. అనేక అంశాలపై మనలో విబేధాలు, భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. నేనెవరిని తప్పు బట్టడం లేదు. మనమందరం కలసి పనిచేయాలి” అంటూ గత నెల 24న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చెప్పిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అసమ్మతి స్వరాల పట్ల ఒకింత సహనం ప్రదర్శిస్తున్నట్లు సంకేతం ఇచ్చారు.
అయితే గత ఆదివారం ఆమె ఉత్తర ప్రదేశ్ కు సంబంధించి ప్రకటించిన ఏడు కాంగ్రెస్ కమిటీలను చూస్తే గాంధీ కుటుంబాన్ని ప్రశినించే వారెవ్వరికి పార్టీలో స్థానం లేదని స్పష్టం చేసిన్నట్లు అయింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల పట్ల, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తూ ఆమెకు గత నెలలో లేఖ వ్రాసిన 23 మంది పట్ల కఠిన వైఖరి ఆవలంభిస్తున్నట్లు స్పష్టమైనది.
2022లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ లేఖపై సంతకం చేసిన వారెవ్వరికి వాటిల్లో స్థానం ఇవ్వలేదు. ఉత్తర ప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్న ప్రియాంక గాంధీ భజనపరులకే స్థానం కల్పించారు.
ఆ లేఖపై సంతకం చేసిన సీనియర్ నేతలైన జితేంద్ర ప్రసాద, రాజా బబ్బర్ లను పక్కన పెట్టారు. అంతేకాదు చైనాతో ఘర్షణలపై పార్టీ విధానాన్ని గతంలో తప్పుబట్టిన మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ ను సహితం పక్కనబెట్టారు. పైగా, ఆ లేఖపై సంతకాలు చేసిన వారిని తూర్పురాబట్టిన పార్టీ నేతలు నిర్మల్ ఖత్రి, నసీబ్ పఠాన్ లకు కమిటీలలో స్థానం కల్పించారు.
పార్టీలో వ్యవస్థాగత సంస్కరణలు కోరుతూ ఆ 23 మంది వ్రాసిన లేఖ బైట పడగానే పలువురు పార్టీ ముఖ్యమంత్రులు సీనియర్ నాయకులు బహిరంగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ప్రకటనలు చేశారు.
వర్కింగ్ కమిటీ సమావేశంలో సహితం వారిద్దరి నాయకత్వం పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తూ సంస్థాగత పటిష్టతకు తగు చర్యలు తీసుకొనే అధికారాన్ని సోనియా గాంధీకి అప్పజెబుతూ తీర్మానం చేసారు.
అంటే గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ అని, ఆ కుటుంభం పట్టు కొనసాగేటట్లు చూడడం తప్ప పార్టీని బలోపేతం చేయడం పట్ల ఆసక్తి లేదని స్పష్టం అవుతున్నది. గత ఏడాది పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ గాంధీ కుటుంభంకు చెందిని వ్యక్తిని అధ్యక్ష పదవిలో ఉంచాలని రాహుల్ గాంధీ సూచించినా అటువంటి ఆలోచన వారికి లేదని కూడా వెల్లడవుతుంది.
రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పే సమయం వచ్చే వరకు సోనియానే ఆ పదవిలో కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ లోగా పార్టీలో సీనియర్ నేతలు, వారి నాయకత్వం పట్ల అసంతృప్తిలో ఉన్న వారందరిని పక్కకు తప్పించే ప్రయత్నాలలో ఉన్నట్లు కనిపిస్తున్నది.
ఉత్తర ప్రదేశ్ లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ నెల 13, 14న రాజీవ్ గాంధీ జీవితం, సందేశం అంశంపై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు లాప్ టాప్ లు, ఐ పాడ్ లను బహుమతులుగా ప్రకటించారు. అంటే తమ కుటుంభం ప్రభావం నుండి బైట పడకుండా గాంధీ కుటుంభం జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
అయితే గాంధీ కుటుంభం పెత్తనంపై కాంగ్రెస్ లో అసమ్మతి స్వరాలు మరోవంక ఉపందుకొంటున్నాయి. ఈ కమిటీలను ఏర్పాటు చేసిన రోజుననే గత ఏడాది పార్టీ నుండి బహిష్కరణకు గురైన తొమ్మిది మంది నేతలు సోనియా గాంధీకి వ్రాసిన ఒక లేఖలో `కుటుంభం అనుబంధం నుండి ఎదిగి పరస్పర విశ్వాసం ప్రాతిపదికన పార్టీని నడపాలని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు చెప్పారు.
ఆమెకు ఈ లేఖ వ్రాసిన వారిలో మాజీ ఎంపీ సంతోష్ సింగ్, మాజీ మంత్రి సత్యదేవ్ త్రిపాఠి తదితరులు ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పార్టీని ప్రజాస్వామ్యరీతిలో నడిపేవారని వారు గుర్తు చేశారు.
వారిలో మాజీ ఎమ్యెల్సీ సిరాజ్ మెహదీ, మాజీ ఎమ్యెల్యేలు భుధర్ నారాయణ్ మిశ్ర, వినోద్ చౌదరి, నేక్ చంద్ర పాండేలు కూడా ఉన్నారు. తమను పార్టీ నుండి సస్పెండ్ చేసి సుమారు సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు తమ వాదనలు వినలేదని వారు విచారం వ్యక్తం చేశారు.
ఇలా ఉండగా, పలు రాష్ట్రాలలో గాంధీ కుటుంబంతో సంబంధం లేకుండా సొంతంగా పార్టీపై పట్టు సాధించుకోవడం జరుగుతున్నది. పంజాబ్ లో కెప్టెన్ అమరిందర్ సింగ్, రాజస్థాన్ లో అశోక్ గెలాట్, కర్ణాటకలో సిద్దరామయ్య ఆ విధంగా గాంధీ కుటుంభంను లెక్క చేయడం లేదు.
I
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’