భార‌త మీడియా ప్ర‌పంచీక‌ర‌ణ చెందాలి

భార‌త మీడియా ప్ర‌పంచ‌కీర‌ణ చెందాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సూచించారు. భార‌తీయ ఉత్ప‌త్తుల‌తోపాటు, భార‌త‌దేశ స్వ‌రం కూడా ప్ర‌పంచ‌వ్యాప్తం అవుతున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా భార‌త్‌ను శ్ర‌ద్ధ‌గా గ‌మ‌నిస్తున్న‌ద‌ని చెప్పారు. 

రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో ప‌త్రికా గేట్ కార్య‌క్ర‌మాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆవిష్క‌రిస్తూ ప‌త్రికా గ్రూప్ చైర్మ‌న్ గులాబ్ కొఠారీ రాసిన రెండు పుస్త‌కాల‌ను ప్ర‌ధాని ఆవిష్క‌రించారు.  ప్ర‌స్తుతం ప్ర‌తి అంత‌ర్జాతీయ సంస్థ‌లో భార‌త్ బ‌లమైన ఉనికిని క‌లిగి ఉన్న‌ద‌ని, అందువవ‌ల్ల భార‌త మీడియా ప్ర‌పంచీక‌ర‌ణ చెందాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.

మ‌న ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్‌లు అంత‌ర్జాతీయ కీర్తిని సాధించుకోవాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ యుగంలో మ‌నం డిజిట‌ల్‌గా ప్ర‌పంచంలోని ప్ర‌తి మూలను చేరాల్సిన అస‌వ‌రం ఉన్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌పంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇస్తున్న‌ట్లుగానే భార‌తీయ సంస్థ‌లు కూడా అద్భుత ర‌చ‌న‌ల‌కు సాహిత్య పుర‌స్కారాలు ఇవ్వాల‌ని ప్ర‌ధాని తెలిపారు.

కోవిడ్‌-19పై భారత మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించిందని ప్రధాని ప్రశంసించారు. సోషల్‌ మీడియా మాదిరిగా మీడియా సైతం కొన్ని సందర్భాల్లో విమర్శలు గుప్పించినా విమర్శల నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలని, ఇదే దేశ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని చెప్పారు.

ప్రజలు పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు ఆథ్యాత్మిక, వేదాంత విజ్ఞానానికే పరిమితం కాదని, విశ్వం, శాస్త్రాల లోతులనూ అందిపుచ్చుకునే సామర్థ్యం కలిగినవని చెప్పుకొచ్చారు.