వ‌ర‌వ‌ర‌రావు అల్లుళ్ల‌కు స‌మ‌న్లు

బీమా కోరేగావ్ కేసులో ఎన్ఐఏ ఇద్ద‌రికి స‌మ‌న్లు జారీ చేసింది.  సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కేవీ కుర్మ‌నాథ్‌, ప్రొఫెస‌ర్ కే. స‌త్య‌నారాయ‌ణ‌లు.. బుధ‌వారం త‌మ ముందు హాజ‌రు కావాల‌ని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ స‌మ‌న్లు జారీ చేసింది. 
 
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ(ఇఫ్లూ)లో స‌త్య‌నార‌య‌ణ ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. ఎన్ఐఏ జారీ చేసిన స‌మ‌న్ల ప‌ట్ల త‌మ కుటుంబం షాక్‌కు గురైన‌ట్లు ఆయ‌న తెలిపారు. బీమాకోరేగావ్ కేసులో అరెస్టు అయిన విప్ల‌వ ర‌చ‌యిత వ‌ర‌వ‌ర‌రావుకు ఈ ఇద్ద‌రూ అల్లుళ్లు అవుతారు. 
 
ముంబైలోని ఎన్ఐఏ ఆఫీసులో హాజ‌రుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.  సాక్ష్యులుగా వారికి స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. సీఆర్పీసీలోని సెక్ష‌న్ 160, సెక్ష‌ణ్ 90 కింద స‌మ‌న్లు జారీ చేశారు.
 
త‌నకు, త‌న సోద‌రుడు కేవీ కుర్మ‌నాథ్‌కు ఎన్ఐఏ స‌మ‌న్లు జారీ చేసినట్లు సత్యనారాయణ ఒక ప్రకటనలో చెప్పారు. 2018 ఆగ‌స్టులో కూడా త‌మ ఇంట్లో ఎన్ఐఏ పోలీసులు సోదా చేసిన‌ట్లు గుర్తు చేశారు.  వ‌ర‌వ‌ర‌రావుకు వ్య‌తిరేకంగా ఏవైనా ఆధారాలు దొరుకుతాయ‌న్న నెపంతో ఆ సోదాలు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
కాగా,  కోవిడ్ హాట్ స్పాట్ అయిన ముంబైకి వెళ్ల‌డం భ‌యంగా ఉన్న‌ట్లు కూర్మనాథ్ పేర్కొన్నారు. బీమా కోరేగావ్ కేసుతో తమ ఇద్ద‌రికీ ఎటువంటి సంబంధం లేద‌ని కుర్మ‌నాథ్ చెప్పారు.