ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి క‌న్నుమూత‌

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి (79)  ఆదివారం వేకువ ఝామున పరమపదించారు. ఆదివారం తెల్లవారు ఝాము 3:30 నిమిషాల ప్రాంతంలో కేర‌ళ‌లోని ఎడ‌నీర్ మ‌ఠ్‌లో కేశ‌వానంద భార‌తి శివైక్యం పొందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు  . 

సుప్రీం కోర్టులోని కేసుల్లో ‘కేశవానంద భారతి కేసు’ ఎంతో చరిత్రాత్మకమైంది. దీన్నే ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసు’ గా చెబుతారు. చాలా కేసులకు ఈ కేసే ప్రాతిపదికగా నడుస్తోంది. రాజ్యాంగ మౌలిక స్వ‌రూపం ఏర్పాటుకు దారి తీసిన కేసులో భార‌త ప్ర‌ధాన పిటిష‌న‌ర్‌గా ఉన్నారు. 

కేర‌ళ భూసంస్క‌ర‌ణ చ‌ట్టంపై 1972లో  కేశ‌వానంద భార‌తి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ కేసును 13 మంది న్యాయ‌మూర్తుల‌తో కోర్టు విచార‌ణ జ‌రిపింది. రాజ్యాంగ మౌలిక స్వ‌రూపానికి సుప్రీంకోర్టు సంర‌క్ష‌ణ‌దారని తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లోనే ఈ కేసు సుదీర్ఘంగా 68 రోజుల పాటు విచార‌ణ జ‌రిగింది.  అప్పటి కేరళ ప్రభుత్వం భూ సమీకరణలో భాగంగా మఠం ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. కేశవానంద భారతి  ఆశ్రమానికి చెందిన మఠాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఈ కేసు దాఖలైంది.  చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని న్యాయ కోవిదులు అభివర్ణిస్తుంటారు.

కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని కేశవానంద  వ్యతిరేకిస్తూ కేసు వేసి, సంచలనం రేపారు. సరిగ్గా అదే సమయంలో కేంద్రంలోని ఇందిర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. దీంతో ఆ తీర్పు కేరళ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే పరిస్థితులు తలెత్తాయి. దీంతో కేశవానంద భారతీ తరపున ప్రముఖ న్యాయవాది నాని పాల్కీవాలా ఈ కేసు వాదించారు.

దీంతో ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణకు ఏకంగా 12 మంది జడ్జీల బృందాన్ని నియమించారు. 68 రోజుల పాటూ ఈ కేసు విచారణ సాగింది. 1972 అక్టోబర్ 31 న విచారణ ప్రారంభమై 1973 మార్చి 23 న ముగిసింది. ఏప్రిల్  24 న తీర్పును వెలువరిస్తూ… ‘‘రాజ్యాంగ మూల సూత్రాన్ని పార్లమెంట్ మార్చడానికి వీల్లేదు’’ అని సంచలన తీర్పు వెలువరించారు. 

1973లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రీ నేతృత్వంలో జేఎం షెలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, బీ జగన్మోహన్ రెడ్డి, డీజీ పాలేకర్, హెచ్ ఆర్ ఖన్నా, ఏకే ముఖర్జీ, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ఏఎన్ రాయ్, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ ఎన్ ద్వివేదీ ఈ కేసును విచారించారు. 

68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది. 13 మంది న్యాయమూర్తుల్లో నలుగురు ఈ తీర్పును వ్యతిరేకించారు. తీర్పు ప్రతులపై సంతకాలు చేయలేదు.

కేశ‌వానంద భార‌తి మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. అణ‌గారిన‌ వ‌ర్గాల అభివృద్ధికి చేసిన కేశవానంద‌ కృషిని, స‌మాజ సేవ ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకుంటామ‌ని మోదీ ట్వీట్ చేశారు. భార‌త‌దేశ గొప్ప సంస్కృతి, సంప్ర‌దాయాలు, రాజ్యాంగాన్ని గౌర‌వించే వారు అని పేర్కొన్నారు. కేశ‌వానంద భార‌తి భావితరాల‌కు స్ఫూర్తిగా నిలుస్తార‌ని మోదీ పేర్కొన్నారు.