భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీసీపీఎల్) ప్రైవేటీకరణ తరువాత కూడా వంట గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిర్వహణలో మార్పు వచ్చిన తరువాత కూడా ప్రస్తుత వ్యవస్థలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
బీపీసీఎల్ పెట్టుబడిదారులు ప్రభుత్వంతో వంట గ్యాస్ సబ్సిడీ సమస్యను లేవనెత్తారు. సంస్థలో ప్రభుత్వ వాటాను విక్రయించిన తరువాత కొత్త నిర్వహణ సబ్సిడీ మొత్తాన్ని భరిస్తుందా అని పెట్టుబడిదారులు అడిగారు. ప్రస్తుతం కంపెనీ సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తుందని, తరువాత ప్రభుత్వం ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రైవేటీకరణ తరువాత కూడా ఈ వ్యవస్థ అమలులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలే కాకుండా.. రిలయన్స్, నైరా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా వంట గ్యాస్‌ను విక్రయిస్తున్నాయి. కానీ ఈ కంపెనీల వినియోగదారులకు ఎటువంటి సబ్సిడీ లభించదు. మార్కెట్ ధర వద్ద వంట గ్యాస్ కొనవలసి ఉంటుంది.
ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వం బీపీసీఎల్ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం కొనసాగిస్తుండగా, రిలయన్స్, నైరా వంటి ప్రైవేట్ సంస్థల వినియోగదారులకు కూడా సబ్సిడీ ప్రయోజనం పొందాలని నిపుణులు అంటున్నారు.
మరోవంక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.40,915 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.38,569 కోట్ల కంటే 6 శాతం ఎక్కువ. ఈ మొత్తంలో రూ.37,256.21 కోట్లు ఎల్‌పీజీ సబ్సిడీకి కేటాయించారు. కానీ ఇప్పటివరకు మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం సబ్సిడీ కోసం కేటాయించిన మొత్తంలో రూ.1900 కోట్లను ఉపసంహరించుకున్నది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ