కరోనా సంక్షోభంలోనూ దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువలా వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏప్రిల్-జూలైలో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐ 20 బిలియన్ డాలర్లుగా ఉన్నదని వెల్లడించారు.
రాష్ట్రాల వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక 2019 అమలు ఆధారంగా ఆయా రాష్ట్రాలకు వచ్చిన ర్యాంకులను విడుదల చేస్తూ సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ ‘సంస్కరణల పట్ల భారత్‌కున్న చిత్తశుద్ధిని విదేశీ మదుపరులు గట్టిగా నమ్మారు. అందుకే వారు తమ పెట్టుబడులకు భారత్‌నే ఎంచుకున్నారు. అలాకాకపోతే కొవిడ్-19 విజృంభణ సమయంలోనూ దేశంలోకి ఎఫ్‌డీఐలు వచ్చేవే కావు’ అని పేర్కొన్నారు.
సులువుగా వ్యాపారం చేయడానికి వీలున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను కేంద్రం తాజాగా విడుదల చేసింది. అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక శాఖ విడుదల చేసిన ఈ సులభతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ) వార్షిక ర్యాంకుల్లో తెలుగు రాస్త్రాలు టాప్-3లో చోటు దక్కించుకున్నాయి.
2018-2019 సంవత్సరంలో రాష్ట్రాలు అమలు చేసిన సంస్కరణల మేరకు కేంద్రం తాజా ర్యాంకులను రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడో సంవత్సరం ప్రథమ స్థానం పొందింది. అయితే తెలంగాణ రెండో స్థానం నుండి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా, గతేడాదితో పోల్చితే ఏకంగా 10 స్థానాలు ఎగబాకింది. 2018లో ఇది 12వ స్థానంలో ఉండటం గమనార్హం.
టాప్-10లో మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఢిల్లీ ర్యాంకు 23 నుంచి 12కు మెరుగుపడగా, గుజరాత్ 5 నుంచి 10కి పడిపోయింది. త్రిపుర అన్నింటికంటే చివరగా 36వ స్థానంతో సరిపెట్టుకున్నది.
సులభతర వాణిజ్యంలో ఐదేళ్లలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆర్ధిక మంత్రి చెప్పారు. సహకారం అందిస్తూ పోటీతత్వం పెంచడం ద్వారా పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ చర్యలతో 2025 నాటికి 5 బ్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేపడతామని ఆమె వెల్లడించారు.
నిర్మాణ రంగంలో ఆన్‌లైన్ అనుమతులు మరింత సులభతరం చేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి అన్నారు. నిర్మాణ రంగంలో 2057 పట్టణాల్లో ఆన్‌లైన్ అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. సులభతర వాణిజ్యంలో 2017లో 185వ స్థానంలో ఉన్నామనీ.. 2020 నాటికి 158 స్థానాలు ఎగబాకకి 27వ స్థానానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి