అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రధం దగ్ధం  

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రథం పూర్తిగా దగ్ధమైంది. ఆలయ ప్రాంగాణంలో ఉంటున్న ఈ రథానికి 60 ఏళ్ల చరిత్ర ఉంది. 
స్వామి వారి రథానికి మంటలు అంటుకోవడంపై ఆలయ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎవరైనా దుండగులు నిప్పంటించారా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

పుణ్యక్షేత్రంలో శ్రీ నరసింహ స్వామి రధాన్ని దుండగులు తగలబెట్టడాన్ని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో కోట్లాది మంది హిందూవుల మనోభావాలుని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఇంత వరకు పట్టుకోలేదని విమర్శించారు. 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. హిందువులు, దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. గతంలో చిత్తూరు జిల్లా బిట్రగుంట వెంకటేశ్వర స్వామి వారి రధాన్ని తగలబెట్టారని, పిఠాపురంలో దేవుడు విగ్రహాలను పగలగొట్టారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి గుర్తు చేశారు.

ఇవన్నీ మతిస్థిమితంలేని వాళ్ళు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోందని, ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగినా.. కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోవడం అత్యంత దారుణమని ఆయన ధ్వజమెత్తారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దేవాలయాల పాలకమండలిలో అన్యమతస్తులకు చోటు కల్పిస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికైనా హిందూ బంధువులు కళ్ళు తెరవాలని పిలుపు ఇచ్చారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని స్వామి శ్రీనివాసానంద సరస్వతి స్పష్టం చేశారు.

 కాగా, రథం దగ్ధంపై  దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి దేవ‌దాయ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌, జిల్లా ఎస్సితో ఫోన్‌లో మాట్లాడారు. విచార‌ణ అధికారిగా దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌మోహ‌న్‌ను మంత్రి వెలంపల్లి నియ‌మించారు.

ఘ‌ట‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, దేవ‌దాయ శాఖ అధికారుల‌తో పాటు పోలీసులు సంబంధిత అధికారుల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని అదేశించారు. అంతే కాకుండా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున నిర్మాణానికి చ‌ర్యలు చేప‌ట్టాల‌ని దేవ‌దాయ క‌మిష‌న‌ర్‌కు మంత్రి సూచించారు.