
కట్టడి ప్రాంతాల్లో (కంటైన్‌మెంట్ జోన్) నివసించే 100 శాతం మందికి (అందరికీ) ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయాలి. ప్రధానంగా వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉన్న నగరాల్లో ఈ తరహా చర్యలు తప్పక చేపట్టాలి. కొవిడ్-19 ‘నెగెటివ్ రిపోర్టు’ అవసరమున్న ప్రతి ప్రయాణికుడికి వారి విజ్ఞప్తి మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.
గర్భిణుల ప్రసవం వంటి అత్యవసర పరిస్థితుల్లో కరోనా ‘నెగెటివ్ ధ్రువపత్రం’ లేదనే సాకుతో చికిత్సకు నిరాకరించడం కానీ, వైద్యం అందించడంలో జాప్యం కానీ చేయరాదు. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వారికి, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని వివరించింది.
లక్షణాలు లేకున్నా శస్త్రచికిత్సలు చేయించుకునే ప్రతి ఒక్కరికీ టెస్టు చేయాలి. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు వారానికి ఒకసారి కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయాలి. కరోనా నిర్ధారణ అయిన బాలింత తన బిడ్డతో సన్నిహితంగా మెలిగే క్రమంలో మాస్క్‌ను ధరించడంతో పాటు ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
శిశువుకు పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రపర్చుకోవాలి. చిన్న పిల్లల్లో ఏ మాత్రం ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడినా వెంటనే పరీక్ష జరపాలి. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చినా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే మరోసారి అదే టెస్టు లేదా ఆర్‌టీ-పీసీఆర్ చేయాలి. ఎటువంటి శస్త్రచికిత్స చేయించుకునే వాళ్లయినా 14 రోజుల ముందు నుంచే హోం ఐసొలేషన్‌లో ఉండాలి. తద్వారా వారికి వైరస్ సోకే ముప్పు తగ్గుతుందని వివరించింది.
కొవిడ్-19 పరీక్షలపై ఇంతకుముందు ఇచ్చిన మార్గదర్శకాలకు పలు అదనపు అంశాలను ఐసీఎంఆర్ జోడించింది. ఆ నిబంధనలను ‘కట్టడి ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, పాయింట్ ఆఫ్ ఎంట్రీ వద్ద స్ర్కీనింగ్’, ‘నాన్ కంటైన్‌మెంట్ జోన్లలో నిరంతర పర్యవేక్షణ’, ‘ఆస్పత్రుల నిర్వహణ’, ‘టెస్టింగ్ ఆన్ డిమాండ్, టెస్టుల ఎంపిక’ అనే నాలుగు భాగాలుగా విభజించింది.
కట్టడి ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడని 65 ఏళ్లకు పైబడినవారు, ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు కలిగినవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికీ కొవిడ్ పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ సిఫారసు చేసింది. కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ తప్పనిసరిగా పరీక్షలు చేయాలని నిర్దేశించింది.
కరోనా నిర్ధారణ అయిన వారితో ఇళ్లు, కార్యాలయాల్లో సన్నిహితంగా మెలిగిన వారిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడకున్నా కాంటాక్ట్‌లోకి వచ్చిన ఐదు నుంచి పదిరోజుల్లోగా వారందరికీ టెస్టులు నిర్వహించాలని సూచించింది. ఈక్రమంలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుకు ఐసీఎంఆర్ తొలి ప్రాధాన్యమివ్వగా, ఆర్‌టీ-పీసీఆర్, ట్రూన్యాట్, సీబీనాట్ పరీక్షలను రెండో స్థానంలో ఉంచింది.
కట్టడి ప్రాంతాల్లో పూర్తిగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయడమే శ్రేయస్కరమని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. నాన్ కంటైన్‌మెంట్ జోన్లలోనూ దాన్నే వాడాలని పేర్కొంది. గత 14 రోజుల వ్యవధిలో విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు, వలస కార్మికుల్లో ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు బయటపడిన వారంలోగా పరీక్షలు చేయాలి.
More Stories
ఓటుకు ఆధార్ లింక్‌పై 18న ఈసీ భేటీ
అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి
హనీ ట్రాప్ లో రక్షణ శాఖ ఉద్యోగి